TG | చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత : సీఎం రేవంత్

హైదరాబాద్: చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై హైదరాబాద్ (Hyderabad) లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారికి అత్యంత కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ ‘భరోసా’ ప్రాజెక్టును తీసుకొచ్చిందని.. అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా పోలీసు సహాయమే కాకుండా న్యాయపరమైన సహాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్ వంటి సేవలను అందిస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. కేసులను వేగవంతంగా పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడమే ఈ కేంద్రాల లక్ష్యమని చెప్పుకొచ్చారు. పోక్సో చట్టం, జ్యువెనైల్ చట్టాలు మన ప్రగతిశీల సాధనాలుగా పనిచేస్తున్నాయని… అయితే ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి హాని కలిగించకుండా, వారి భవిష్యత్తుకు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజలు, ముఖ్యంగా యువత సోషల్ మీడియా వాడకం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి (Supreme Court Judge) జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
