AUDIT | ఆర్టీసీ ఉద్యోగి చేతివాటం

AUDIT |ఆర్టీసీ ఉద్యోగి చేతివాటం
సొమ్ము మరో ఖాతాలోకి మళ్లింపు
నంద్యాల ఆర్టీసీ డిపోలో నిధులు గోల్‌మాల్
ఆడిట్ నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు

AUDIT |నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ల మీద పోతుంది అన్న సామెత ప్రకారం… అధికారుల ఉదాసీనత వైఖరి వల్ల నంద్యాల ఆర్టీసీ డిపోలో కొంత నిధులు వేరే వారి ఖాతాకు జమ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గుట్టుగా ఉంచినప్పటికీ కొంతమంది అందులో పని చేసే సిబ్బంది ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆదివారం నంద్యాల ఆర్టీసీ డిపోలో ఆడిట్ నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ మాధవి లత (Manager Madhavi Latha) తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొమ్ము దుర్వినియోగమైందన్న ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. సుమారు 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు వరకు ఈ సొమ్ము దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడిట్ అనంతరం ఎవరి ఖాతాల్లోకి సొమ్ము జమ అయ్యింది అనే అంశాన్ని ఆడిట్ రిపోర్ట్ అనంతరం విషయాలన్నీ బయటికి వస్తాయని ఆమె తెలిపారు. ప్రస్తుతమేనా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా అనే కోణంలో కూడా ఆడిట్ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఆడిటర్ అనంతరం ఎవరిపై చర్య తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

