Rs1.39lakh cr | ప్రజల జీవన ప్రమాణాలే నిజమైన అభివృద్ధి..

Rs1.39lakh cr | ప్రజల జీవన ప్రమాణాలే నిజమైన అభివృద్ధి..
విద్యపై ఖర్చు పెంచాలి..
సమాన అవకాశాలే బలమైన దేశానికి మార్గం
ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ వల్లూరు భార్గవ్
Rs1.39lakh cr | విజయవాడ, ఆంధ్రప్రభ : దేశ అభివృద్ధిని కేవలం జీడీపీ వృద్ధి, మార్కెట్ సూచికలతో మాత్రమే కొలవడం సరైన విధానం కాదని ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వల్లూరు భార్గవ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, సమాజ బలం, అసమానతల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల భద్రత వంటి అంశాలే అసలైన అభివృద్ధి ప్రమాణాలని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని పేద వెనుకబడిన వర్గాలను పక్కన పెట్టే అభివృద్ధిని నిజమైన పురోగతిగా పరిగణించలేమన్నారు. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రజల జీవన ప్రమాణాలను ఎంతవరకు మెరుగుపరుస్తుందన్నదే అసలు ప్రశ్న అని ఆయన అన్నారు.
విద్య రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే సమానత్వం సాధ్యం కాదని వల్లూరు భార్గవ్ హెచ్చరించారు. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో విద్యకు సుమారు రూ 1.39 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ, దేశ జీడీపీలో 6 శాతం వ్యయం లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదన్నారు. ఇది ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. విద్యకు కేటాయించిన నిధులు కేవలం సంఖ్యలుగానే కాకుండా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పెంపు, ఉపాధ్యాయ నియామకాలు, శిక్షణ, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతం, వెనుకబడిన వర్గాలకు అవకాశాల విస్తరణ రూపంలో కనిపించాలన్నారు.
సరైన అమలు, పర్యవేక్షణ లేకుండా కేటాయింపులు ఫలితం ఇవ్వవని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మానవ వనరులపై నిరంతర పెట్టుబడులు అవసరమని వల్లూరు భార్గవ్ తెలిపారు. పిల్లల సాధికారత, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండడం, దీర్ఘకాలిక సామర్థ్య నిర్మాణం ఇవే సమృద్ధి, సమానత్వం కలిగిన దేశానికి పునాది అని చెప్పారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం అనే భావనను పునర్నిర్వచించాల్సిన సమయం వచ్చిందని, కేవలం గణాంకాల కంటే గౌరవం, సమానత్వం, స్థిరత్వాన్ని పెంపొందించే అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
