దివ్యాంగుని సమస్యను వింటున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా..

దివ్యాంగుని సమస్యను వింటున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా..

ఆపన్నహస్తమే జీవితానికి ఆశాకిరణం..
దివ్యాంగుని సంకల్పానికి కలెక్టర్ ల‌క్ష్మీశ భరోసా…

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రతికూల పరిస్థితులు మనిషిని వెనక్కినెట్టవచ్చు కానీ, ధైర్యం, పట్టుదల ఉంటే అదే పరిస్థితులు విజయానికి పునాది కావచ్చనే మాటకు ప్రత్యక్ష నిదర్శనం విజయవాడ బోస్‌నగర్ కండ్రికకు చెందిన ఎం. మల్లికార్జున నాయుడుస్వామి. దివ్యాంగుడైనప్పటికీ జీవితంపై నమ్మకం కోల్పోకుండా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. చిన్న స్టీల్ దుకాణం ప్రారంభించి, కష్టపడి పనిచేస్తూ బతుకు బండిని లాగిస్తున్నారు. ప్రతిరోజు తన శారీరక ఇబ్బందులను జయిస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఆత్మగౌరవంతో జీవించాలనే ఆయన తపన చుట్టుపక్కల వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించి, స్థిరమైన ఆదాయ వనరుగా మార్చుకోవాలనే లక్ష్యంతో రూ.5లక్షల రుణం మంజూరు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో తీసుకున్న ముద్రా రుణాన్ని పూర్తిగా చెల్లించానని, ప్రస్తుతం ఎలాంటి బకాయిలు లేవని వివరించారు.

బ్యాంకు రుణం అందితే తన దుకాణాన్ని అభివృద్ధి చేసి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ.. మల్లికార్జున నాయుడు చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి పట్ల ఉన్న నిబద్ధతను అభినందించారు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనే మీ సంకల్పం అభినందనీయం. అవసరమైన విధంగా చేయూత అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సమాజంలో అవకాశాల కోసం ఎదురు చూడకుండా, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలనే సందేశాన్ని మల్లికార్జున నాయుడుస్వామి జీవితం ఇస్తోంది. ఆపన్నహస్తం అందితే ఆయన కలలు కచ్చితంగా నిజమవుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Leave a Reply