సీఎం ఆదేశాలతో టీటీడీ విద్యా సంస్థలకు డిజిటల్ శోభ

సీఎం ఆదేశాలతో టీటీడీ విద్యా సంస్థలకు డిజిటల్ శోభ

తాజా బడ్జెట్ లో రూ. 118 కోట్ల కేటాయింపు

తిరుపతి (రాయలసీమ) ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలమేరకు తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కు చెందిన విద్యాసంస్థలన్నీ అత్యాధునిక శాస్త్ర సాంకేతిక సౌకర్యాలతో డిజిటల్ శోభ ను సంతరించుకోనున్నాయి. అందుకు తగినట్టుగానే టి టి డి యాజమాన్యం  2026 – 2027 ఆర్ధిక సంవత్సరానికి తమ ఆధీనంలోని విద్యా శాఖకు వార్షిక బడ్జెట్ లో రూ 118. 89 కోట్ల నిధులను కేటాయించింది.

టీటీడీ చరిత్రలో ఇదొక అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చును. తిరుమల క్షేత్రం, అనుబంధ ఆలయాల నిర్వహణ, హిందూ ధార్మిక ప్రచారం, భక్తుల సంక్షేమం మొదటి ప్రాధాన్యత గా పని చేసే టీటీడీ దేశ స్వాతంత్రానికి ముందునుంచే మానవసేవే మాధవ సేవ అన్న ఆర్యోక్తి కి అనుగుణంగా విద్యా, వైద్య రంగాల నిర్వహణ కు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తిరుపతి ప్రాంతంలో ఏర్పాటైన యూనివర్సిటీలకు అవసరమైన స్థలాలను కేటాయించడం నుంచి  ప్రాధమిక స్థాయి నుంచి పి జి స్థాయి వరకు సనాతన వేద విద్య, అత్యాధునిక విజ్ఞాన శాస్త్ర విద్యా బోధన లందించే 50 దాకా విద్యాసంస్థలను నిర్వహించడం వరకు టీటీడీ దశాబ్దాలుగా బాధ్యతలను నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా టీటీడీ విద్యా సంస్థల్లో విద్యార్థిని విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. ఆ సూచనల మేరకు టీటీడీ యాజమాన్యం అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో సమగ్ర మార్పులు తీసుకురావాలని సంకల్పించింది.

ఈ మేరకే ఇటీవల జరిగిన  టిటిడి ధర్మకర్తల మండలి ఆమోద ముద్ర వేసిన 2026 – 2027 ఆర్థిక సంవత్సరానికి  వార్షిక బడ్జెట్ లో టీటీడీ  విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి  రూ.118.89 కోట్ల నిధులను టిటిడి కేటాయించింది. ఈ కేటాయింపును టీటీడీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చును, ఎందుకంటే ఇటీవలి సంవత్సరాలలో టీటీడీ విద్యా శాఖలో జీతాలు మినహా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు రూ. 50 కోట్ల కన్నా తక్కువగానే ఉన్నాయి. 

2021–2022  వార్షిక బడ్జెట్ లో రూ.24.37 కోట్లు, 2022–2023 వార్షిక బడ్జెట్ లో రూ.39.04 కోట్లు, 2023–2024 వార్షిక బడ్జెట్ లో  రూ.33.08 కోట్లు, 2024–2025 వార్షిక బడ్జెట్ లో రూ.25.99 కోట్లు, 2025–2026 వార్షిక బడ్జెట్ లో రూ.13.08 కోట్లు చొప్పున టీటీడీ విద్యాశాఖకు నిధులను కేటాయించారు. కేటాయించారు. ఈ నిధులతో నే భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి తదితర పనులు చేపట్టారు.ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయించిన మొత్తం రూ.118.89 కోట్లతో   శ్రీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, టీటీడీ కలిపి విద్యాసంస్థలను వివిధ రకాలుగా ఆధునికరించి విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. 

టీటీడీ విద్యా సంస్థలలో అదనపు తరగతి గదులు, అదనపు వసతి గదుల నిర్మాణం, పాఠశాలలు మరియు కళాశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అత్యాధునిక సాంకేతిక బోధనకు పెద్దపీట వేస్తూ డిజిటల్ క్లాస్‌రూమ్స్, కంప్యూటర్లు, స్మార్ట్ ప్యానల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, వర్చువల్ కాన్ఫరెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలలలో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మొబైల్ మెడికల్ యూనిట్ సేవలు అందించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.

 విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి స్పోర్ట్స్, సాంస్కృతిక, సహ పాఠ్య కార్యకలాపాలు, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్, సీఏ, క్లాట్ తరహా కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్, జాబ్ ఓరియెంటెడ్, వృత్తి ఆధారిత కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా విద్యాసంస్థల ( జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల)లో చదువుతున్న విద్యార్థినులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన రీతిలో టీటీడీ ధర్మకర్తల మండలి  ఛైర్మెన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి  ఎం. రవిచంద్ర, టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ ల  పర్యవేక్షణలో సంబంధిత సిబ్బంది సమగ్ర ప్రణాళికలను రూపకల్పన చేస్తున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Leave a Reply