ఎలాంటి శిక్ష లేకుండా ఒక్క మర్డర్ చేసుకునే అవకాశం మహిళలకు ఇవ్వండని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ-శరద్ పవార్ ( NCP SP) మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే ఏకంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లేఖ రాసిన ఖడ్సే.. ఎలాంటి పనిష్మెంట్ లేకుండా ఒక మర్డర్ చేసుకునే అవకాశం మహిళలకు ఇవ్వాలని కోరారు. స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం.
ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఖడ్సే లేఖలో పేర్కొన్నారు. అయితే మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు. సమాజంలో మహిళలను అణచివేసే మనస్తత్వం, రేపిస్ట్ మనస్తత్వం, శాంతిభద్రతలకు భంగం కలిగించే ధోరణులను కలిగివున్న వారిని చంపాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మహిళల కిడ్నాప్, గృహహింస నేరాలు పెరుగుతుండటంతో మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా భారతదేశం ఉందని ఒక సర్వే నివేదికను కూడా ఆమె ప్రస్తావించారు. చివరగా ‘మా డిమాండ్ పై ఆలోచించి మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం’ అని ఖడ్సే అన్నారు.