అచ్చంపేట, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ) : భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో విపత్తును చూడలేదని, ఎస్ ఎల్ బి సి టన్నెల్లో సంభవించిన విపత్తులో సహాయక చర్యలను, రెస్క్యూ ఆపరేషన్ ను భారత సైన్యం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన దోమలపెంటలోని ఎస్ ఎల్ బి సి టన్నెల్ ను సందర్శించారు. రెస్క్యూ ఆపరేషన్ లో తీసుకుంటున్న సహాయక చర్యలను అధికారులు ఆయనకు నమూనా టన్నెల్ బోర్ మిషన్ ద్వారా వివరించిన అనంతరం టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… భారతదేశంలో ఇప్పటి వరకు ఇంతటి భయంకరమైన విపత్తు సంభవించలేదని, కార్మికులను రక్షించడానికి జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, 12 జాతీయ సంస్థలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయని తెలిపారు. 14 కిలోమీటర్లలో సంభవించిన దుర్ఘటన ప్రాంతానికి 50 మీటర్ల దగ్గర భారీగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నందున రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టతరంగా మారిందని, రెస్క్యూ టీం సభ్యులకు ప్రాణాపాయం పొంచి ఉన్నందున ఆదివారం నుండి రోబోలను సహాయక చర్యలలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. శనివారం సుమారు 525 మంది సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు తెలిపారు. శుక్రవారం కేరళ నుంచి వచ్చిన కేడోవర్ డాగ్స్ ముగ్గురు కార్మికుల ఆనవాళ్లను అనుమానించగా అక్కడ రాట్ హోల్ మైనస్ తవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు.
నేటి వరకు భారతదేశ చరిత్రలో ఇంతటి విపత్కర పరిస్థితి సంభవించలేదని, ఇక్కడికి వచ్చిన నిపుణులు సైతం పేర్కొంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో అనునిత్యం చర్చిస్తూ ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఆపరేషన్ ను పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. టన్నెల్లో చిక్కుపోయిన కార్మికులు ఇక జీవించలేరని, కచ్చితంగా నిర్ధారణకు వచ్చినట్లయితే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్నల్ పరీక్షిత్ మేహర, డిజాస్టర్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
