ROAD | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని మోత్కూర్-రాయగిరి మెయిన్ రోడ్డు మూడేళ్లు గడిచినా నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, తక్షణమే ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టేలా చూడాలని కోరుతూ బుధవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గుంతల రోడ్డులో మోకాళ్లపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. పాలకులు మారినా మోత్కూరు రహదారుల తలరాతలు మారలేదని, నత్తలే నవ్వుకుంటున్నాయని విమర్శించారు. రాజన్నగూడెం నుండి మదర్ డెయిరీ వరకు ఉన్న రోడ్డు నిత్యం యాక్సిడెంట్లు , దుమ్ము ధూళితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అంబేద్కర్ చౌరస్తా దగ్గర నుండి ఇందిరానగర్ కాలనీ వరకు మధ్యలో డివైడర్ వేసి రోడ్డు నిర్మించాలని, కొద్ది దూరం మాత్రమే డివైడర్ వేసి రోడ్డు మరిచారని ఎద్దేవా చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షురాలు చాడ మంజులా రెడ్డి, ఉపాధ్యక్షులు కందుకూరు ప్రకాష్, ప్రధాన కార్యదర్శి అన్నెపు సత్యనారాయణ, పట్టణ కార్యదర్శులు ముత్తినేని తిరుమలేష్ , వనం రేణుక, కోశాధికారి మాద సోమేశ్వరి,సీనియర్ జిల్లా నాయకులు బొట్టు అబ్బయ్య, గౌరు శ్రీనివాస్ గుప్తా, పోచం సోమయ్య, దీటి సందీప్, పట్టణ నాయకులు బద్దం మహేందర్ రెడ్డి, పురుగుల కృష్ణ, నల్ల మాసిరెడ్డి, సజ్జనం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

