విద్యార్థికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా, జూపాడుబంగ్లా (ఆంధ్రప్రభ): జూపాడుబంగ్లా మండల కేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాల కారణంగా విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం జూపాడుబంగ్లా మండలంలోని తరిగొపుల గ్రామానికి చెందిన భూషయ్య, సావిత్రి దంపతుల కుమారుడు జయవర్ధన్ జూపాడుబంగ్లాలోని మోడల్ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఓ దుకాణంలో కురుకురే ప్యాకెట్ కొనుక్కొని రోడ్డుపై వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ కోతి అతడిని వెంబడించడంతో భయపడి పక్కకు పరుగెత్తాడు. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ట్రాక్టర్ అతడిని ఢీకొంది. పోలీసులు హుటాహుటిన తమ వాహనంలోనే గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జూపాడుబంగ్లా పోలీసులు తెలిపారు.