Road Accident | చావుబతుకుల మధ్య సోమగూడెం యువకుడు..

Road Accident | చావుబతుకుల మధ్య సోమగూడెం యువకుడు..

  • దాతల సాయం కోసం ఎదురుచూపు!
  • రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం..
  • సర్జరీకి రూ. 10 లక్షలు అవసరం

Road Accident | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : విధి ఆ కుటుంబంపై పగబట్టింది. తండ్రి లేని ఆ ఇంట్లో ఆటో నడిపే అన్నే ఆధారం.. కళ్లు కనపడని వృద్ధురాలైన తల్లికి ఆ కొడుకులే లోకం. అటువంటి పేద కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా సోమగూడెం గ్రామానికి చెందిన రాచర్ల సురేష్ బాబు నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువుతో పోరాడుతున్నాడు. తీవ్రంగా గాయపడ్డ సురేష్ బాబు నిన్న రాత్రి మంచిర్యాల మీదుగా బెల్లంపల్లికి వెళ్తున్న క్రమంలో సురేష్ బాబు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనలో అతడి తలకు తీవ్రమైన గాయం కావడంతో రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సురేష్ బాబు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆర్థిక భారంతో కుదేలైన కుటుంబం సురేష్ బాబు ప్రాణాలు కాపాడాలంటే అత్యవసరంగా తలకు సర్జరీ చేయాలని, అందుకు దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తండ్రి లేకపోవడంతో అన్న కుమారస్వామి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

తల్లి కళ్లు కనపడని వృద్ధురాలు కావడంతో కొడుకు పరిస్థితి చూసి కన్నీరుమున్నీరవుతోంది. అంత పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి తలకు మించిన భారంగా మారింది. “తన తమ్ముడు చావుబతుకుల మధ్య ఉన్నాడని.. సర్జరీకి అంత డబ్బు తమ దగ్గర లేదని. దాతలు పెద్ద మనసుతో స్పందించి తన తమ్ముడి ప్రాణాన్ని కాపాడాలని అన్న కుమారస్వామి కన్నీటితో వేడుకుంటున్నాడు. సాటి మనిషికి సాయం చేయాలనే తపన ఉన్న వారు, ఉదార స్వభావం కలిగిన దాతలు తమకు తోచినంత ఆర్థిక సాయం 99634 93275 అనే నంబరుకు ఆన్ లైన్ ద్వారా అందించి సురేష్ బాబును మృత్యువు నుంచి కాపాడాలని సోమగూడెం గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు.

Leave a Reply