Revanth Reddy | ఇంటర్ డ్రాపౌట్ తగ్గించడమే లక్ష్యం..

  • విద్యావ్యవస్థ పటిష్టతపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్ : పదవ తరగతిలో ఉత్తీర్ణులయ్యే ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు విద్య కొనసాగించేలా అనుకూల వాతావరణం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 10వ త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్య‌లో ఉత్తీర్ణ‌త క‌నిపిస్తున్నప్పటికీ ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యే స‌రికి ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డానికి గ‌ల కారణాలను అధ్యయనం చేసి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని సూచించారు.

ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయడానికి వ్యవస్థకు సమగ్ర మద్దతు ఇవ్వాలని సూచిస్తూ, విద్యా శాఖపై ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత శాతం ఉన్నప్పటికీ, ఇంటర్ వరకు విద్య కొనసాగించేవారి సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్యాప్‌కు గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సీఎం, ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు అమలవుతున్న విద్యా విధానాలను అధ్యయనం చేసి, తగిన మార్గాలు ఆవిష్కరించాలని ఆదేశించారు.

ఇంటర్ విద్యలో చేరికల పెంపు, హాజరుపై దృష్టి:

ఇంటర్మీడియట్ దశ విద్యార్థి భవిష్యత్తులో కీలకమైందని తెలియజేస్తూ, తగిన మార్గదర్శకత్వంతో విద్యార్థులకి సరైన మార్గాన్ని చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం పేర్కొన్నారు. దీనిలో భాగంగా విద్యా కమిషన్, ఎన్‌జీవోలు, పౌర సమాజ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇంటర్ విద్యలో చేరికల పెంపుతో పాటు హాజరుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రతిపాదన:

ఇంట‌ర్మీడియ‌ట్ విద్యను పటిష్టపరచడానికి శాస‌న‌స‌భ‌లోనూ చ‌ర్చ‌కు పెడ‌తామ‌ని, ఇంటర్‌లో విద్యార్థుల చేరిక‌తో పాటు వారి హాజ‌రుపైనా దృష్టిపెట్టాల‌న్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Young India Integrated Residential School) న‌మూనాల‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప‌రిశీలించారు.

ప్ర‌తి పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాల‌ని సూచించారు. పాఠ‌శాల‌ల నిర్మాణం ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, నిర్మాణాల ప్ర‌గ‌తిపై ప్ర‌తి వారం త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో బాలుర‌కు ఒక‌టి, బాలిక‌ల‌కు ఒక‌టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణాల‌ను చేప‌డ‌తామ‌న్నారు. ఇప్ప‌టికే ఒక్కో పాఠ‌శాల‌కు సంబంధించి స్థ‌ల సేక‌ర‌ణ పూర్త‌యినందున‌, రెండవ పాఠ‌శాల‌కు సంబంధించిన స్థ‌ల గుర్తింపు, సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై దృష్టి సారించాల‌ని ఆదేశించారు.

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ప్రాజెక్ట్ ప్రగతి:

చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ నిర్మాణ నమూనాను సమీక్షించిన సీఎం, ఇందులో పలు మార్పులు సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి దిశగా ఇది ఒక కీలక ప్రకటనగా మారుతోంది.

Leave a Reply