- నవంబర్ 11లోగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
- కేసీఆర్, హరీష్‌రావులపై చర్యలు తీసుకోండి
హైదరాబాద్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అదేవిధంగా బీఆర్‌ఎస్–బీజేపీ పార్టీలు, కేటీఆర్ వైఖరిపై ఘాటైన విమర్శలు గుప్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పై జ్యూడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నెల 11లోగా బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. లేకుంటే రెండు పార్టీలు ఒకటేనని తేలిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఈ కేసును సీబీఐకి అప్పగించామని, వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులను చంచల్‌గూడ జైలుకు పంపాలని సీఎం కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ-కార్ రేసులో జరిగిన రూ.50 కోట్ల దుర్వినియోగంపై కూడా చర్యలు చేపట్టాలన్నారు. కాళేశ్వరం బీఆర్‌ఎస్‌కు “ఏటీఎం”గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ గుర్తు చేశారు.
ఇక సొంత చెల్లెలి అయిన కవితను సాయం చేయని కేటీఆర్, పిన్నమ్మ బిడ్డను ఎలా ఆదుకుంటాడు? అని ప్రశ్నించారు. కవిత స్వయంగా తన అన్న కేటీఆర్ అక్రమంగా కూడబెట్టిన ఆస్తులలో చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆరోపించిందని రేవంత్ గుర్తు చేశారు. చెల్లిని ఇంటి నుండి గెంటేసినోడు, ఇతరులను ఎలా ఆదుకుంటాడు? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ విలీనం అవడం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నేను చెప్పడం కాదు… కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో ఉన్నప్పుడు ఈ రెండు పార్టీల మధ్య విలీనం చర్చలు జరిగాయని ఆమె తానే చెప్పిందని రేవంత్ పేర్కొన్నారు.
పదేళ్లుగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పనినీ చేయలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. నేడు ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీల సమస్యలు బీఆర్‌ఎస్ పాలన పాపమే అని తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వకుండా, ఒక్కసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నవీన్ యాదవ్ పేద కుటుంబానికి చెందిన నాయకుడని, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాడని చెప్పారు. సెంటిమెంట్ కాకుండా, అభివృద్ధి దృష్టితో ఓటు వేయాలని ప్రజలను కోరారు.

