ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : వావాహ వేడుకలు రోజురోజుకు శ్రుతిమించుతూ సంస్కృతి, ఆచారాలు కనుమరుగవుతున్ననేపథ్యంలో లంబడా గిరిజన పెద్దలు నిషేధాజ్ఞలు విధిస్తూ తీర్మానాలు చేయడం ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాoశంగా మారింది. సంపన్న, పేద వర్గాల మధ్య పెళ్లి వేడుకలు, కానుకలు కుటుంబాల మధ్య చిచ్చు రేపు తుండడంపై లంబాడా గిరిజన సంఘాల నేతలు సమావేశమై పలు ఆంక్షలతో కూడిన తీర్మానాలు చేశారు.
గతంలో సంప్రదాయబద్ధంగా ఎలాంటి ఖర్చులు లేకుండా సాదాసీదాగా పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు మాత్రం పెళ్లికి ముందే అసభ్యకరమైన ప్రీ వెడ్డింగ్ షూట్ లు, హల్దీ ఫంక్షన్లు, డీజే సౌండ్స్ తో పేరంటాలు సాధారణ తంతుగా మారాయి. వీటివల్ల లక్షల్లో ఖర్చు పెరగడమే గాక పేద, ధనిక కుటుంబాల మధ్య అసమానతలు రేకెత్తిస్తున్నాయి. లక్షల్లో కానుకలు, 20 తులాల పైనే బంగారం డిమాండ్ చేయడంతో పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతుండడం వల్ల కఠిన పరిమితులతో నిషేధాలు విధించామని లంబాడ హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భరత్ చౌహన్ తెలిపారు. బంజారాల పెళ్లి వేడుకల ఆడంబరాలపై విధించిన నిషేధ పరిమితులు అమల్లోకి వస్తున్నాయని ఆయన వివరించారు.
నో డీజే…
పెళ్లి వేడుకకు ముందు హల్దీ ఫంక్షన్ కు లక్షల్లో డబ్బులు వృథా చేస్తుండడంతో ఎక్కడ హల్దీ ఫంక్షన్ జరిగినా సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, డీజే సౌండ్ తో డ్యాన్సులు చేయడం నిషేధించామని భరత్ చౌహన్ తెలిపారు. తమ కుల సంఘం ఆధ్వర్యంలో చేసిన తీర్మానాలను వివరించారు. ముఖ్యంగా పెళ్లికి ముందు కట్న కానుకలు ఎక్కువగా డిమాండ్ చేయవద్దని, వధువుకు సరిపడా మూడు తులాల బంగారం, అబ్బాయి చేతి ఉంగరానికి పది గ్రాముల గోల్డ్ మాత్రమే మాట్లాడుకోవాలని, ఇంతకుమించి అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు.
కులపెద్దల సమక్షంలోనే నిశ్చితార్థం
కుల పెద్దల సమక్షంలోనే నిశ్చితార్థం నిర్వహించాలని సంఘం తీర్మానించింది. తీర్మానాలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు కూడా విధిస్తామని భరత్ చౌహన్ స్పష్టం చేశారు. సంప్రదాయాలు పాటించేలా తాము పలు షరతులతో పెళ్లిళ్లు జరిపేలా చూస్తున్నామని, ఇందుకు గ్రామాల్లో సైతం సానుకూల స్పందన లభిస్తుందని బంజారా సంఘం నాయకులు తెలిపారు. వచ్చే నెలలో జరిగే బంజారాల సంఘం కీలక సమావేశంలో పలు అంశాలు చర్చిస్తామన్నారు.