చట్టాన్ని గౌరవించండి !

చట్టాన్ని గౌరవించండి !
కుటుంబాన్ని రక్షించండి
జూదం, మద్యపానంతో కుటుంబ పురోగతి నాశనం
ప్రజలకు వినూత్న రీతిలో శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసుల అవగాహన
శ్రీకాకుళం, నవంబర్ 6(ఆంధ్రప్రభ): జూదం, మద్యపానం వంటి దుష్ప్రవర్తనల వలన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు శ్రీకాకుళం (Srikakulam) వన్‌టౌన్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్నినిర్వహించారు. ఇటీవల శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఐదుగురు వ్యక్తులపై నమోదు చేసిన కేసు పై విచారణ జరిపిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, నిన్న తీర్పు వెలువరించింది.
ఈ నేపథ్యంలో కోర్టు వారు ఆదేశాలు మేరకు పై ఐదుగురు వ్యక్తులు గురువారం ఉదయం శ్రీకాకుళం పీఎస్ఆర్ కూడలి (PSR Junction) లో జూదం – మద్యపానం నిషేధ చట్టాన్ని గౌరవించండి – కుటుంబాన్ని రక్షించండి అనే ప్లకార్డులు పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు చట్టాలను పాటించాలనీ, జూదం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సందేశం ఇచ్చారు.
జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి (K.V. Maheshwara Reddy) మాట్లాడుతూ… జూదం, మద్యపానం వంటి దుష్ప్రవర్తనలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ప్రతి ఒక్కరూ జూదం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, చట్టాన్ని గౌరవించి, శ్రేయోభిలాషిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శాఖ తరఫున ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన చెప్పారు.
డీఎస్పీ సీహెచ్ వివేకానంద (DSP CH Vivekananda) మాట్లాడుతూ.. నిందితులు తమ తప్పిదాన్ని గ్రహించి, సమాజంలో ఇలాంటి దుష్ప్రవర్తనలు జరగకుండా మంచి నడవడికతో చైతన్య కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. కార్యక్రమాన్ని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో నిర్వహించగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడిపు నాయుడు, టూ టౌన్ సీఐ ఈశ్వరరావు, ట్రాఫిక్ సిఐ నాగరాజు, వన్ టౌన్ ఎస్సై హరికృష్ణ, పోలీసు సిబ్బంది ఉన్నారు.
