రైతుల త్యాగాలను అవమానించొద్దు….

రైతుల త్యాగాలను అవమానించొద్దు….

అమరావతే ప్రజా రాజధాని
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో దీర్ఘకాల అభివృద్ధి
కర్నూలులో త్వరలో బెంచ్ ఏర్పాటు.
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కూటమి లక్ష్యం..
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్

విజయవాడ, ఆంధ్రప్రభ : అమరావతికి రాజముద్ర పడిందని, ఇది ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కీలక మలుపని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. రాజధాని లేకపోవడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నదని, ఈ పరిస్థితికి కారణమైన రాజకీయ వైఖరులపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధాని మారినప్పటి నుంచి రాష్ట్రానికి స్థిరత్వం లోపించిందని వివరించారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని లేకపోవడం వల్ల పరిపాలనలో, అభివృద్ధిలో అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఒక దశలో ప్రతిపక్ష నేత రాజధానికి 50 వేల ఎకరాలు కావాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, తర్వాత వారి వైఖరిలో వచ్చిన మార్పును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అమరావతిని అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, రాజకీయ ప్రయోజనాల కోసం రాజధాని అంశాన్ని వైసీపీ వాడుకున్నారని మండిపడ్డారు.

అమరావతి కోసం రైతులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ భూములను త్యాగం చేశారని, వారి త్యాగాలను చిన్నచూపు చూడడం అన్యాయమని స్పష్టం చేశారు. రైతులు, విలేకరులు కలిసి రాజధాని కోసం పోరాడారని, అనేక మీడియా సంస్థలు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. అమరావతిని ముంబై, కలకత్తా నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చేయవచ్చని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు పాత్రను ప్రస్తావిస్తూ అమరావతి బ్రాండ్ చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ప్రధాన భాగం హైదరాబాద్ నుంచే వస్తోందని ఉదాహరణగా చూపిస్తూ, ఒక బలమైన రాజధాని రాష్ట్ర అభివృద్ధికి ఎంత కీలకమో వివరించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, రాబోయే సంవత్సరాల్లో ఇదే ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి ప్రాంతీయ సమతుల అభివృద్ధి సాధిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ, ప్రజల ఆశయాలను అవమానించారని ఆరోపించారు.

అమరావతి పేరును అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో మాయనాటకాలు ఇక కొనసాగవు… ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు అని హెచ్చరిస్తూ, అమరావతి అంశం రాష్ట్ర ప్రజల భావోద్వేగానికి ప్రతీకగా మారిందని, దాన్ని అవమానించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.

Leave a Reply