ఆ కేసులో చెవిరెడ్డికి రిలీఫ్ !!

తిరుపతి రూరల్, (ఆంధ్రప్రభ) : ఏపీలో లిక్కర్‌ స్కాం కేసులో చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, టుడా మాజీ ఛైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. లిక్కర్‌ కేసులో 39వ నిందితునిగా సిట్‌ అధికారులు చేర్చడంతో, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటీషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటీషన్‌ను హైకోర్టు ఈనెల 7వ తేదీన కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ఏ సంబంధం లేకుండా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయడానికి సిట్‌ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని, ఆ కేసులో తనను అరెస్టు నుంచి తప్పించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు.

చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తరపున న్యాయవాదులు ఆ విషయాన్ని ధర్మాసనం ముందుకు తీసుకువెళ్లగా, ఏపీ ప్రభుత్వం, సిట్‌ అధికారుల తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గి, సిద్ధార్థ్‌ లూత్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌లు వాదనలు వినిపించారు.

ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వానికి, సిట్‌ అధికారులకు నోటీసులు పంపి, కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది.

Leave a Reply