Relationship | అమానవీయ ఘటన..

Relationship | అమానవీయ ఘటన..
దయనీయం.. మృతదేహంతో బేరం..!
- మానవ సంబంధాలను చెరిపేసిన అమానవీయ ఘటన
- జన్మనిచ్చిన ‘అమ్మ’ శవంతో బేరాలాడిన కన్నకూతురి వైనం
Relationship, మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కన్న తల్లిదండ్రులు ఎవరైనా.. కడుపున పుట్టిన పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. అదే పదివేలని’ భావిస్తారు. పెనవేసుకు పోయిన పేగు బంధం ఏనాడూ రక్త సంబంధాలను తెగదెతెంచుకోకూడదని కలలు కంటారు. పిల్లలే తమ సర్వస్వమని తెగ సంబరపడి పోతారు. అలాంటి తల్లిదండ్రులు గల సభ్యసమాజం ఇది. చిన్న నాడు ఎద మీద తన్నినా.. బిడ్డల ఎదుగుదల తప్పా దేనికీ వెరవని, వెల కట్టలేని కమ్మని కమనీయ బంధమిది. అలాంటిది తుదిశ్వాస విడిచిన తల్లి మృతదేహాన్ని ముంగిట పెట్టుకుని ఆస్తిపాస్తుల కోసం కూరగాయల్లాగా బేరాలాడితే… అలాంటి దృశ్యకావ్యం కళ్ళెదుట సాక్షాత్కారమిస్తే ప్రాణం తరుక్కుపోదూ..! గుండెలు అవిసిపోవూ..!! ఇలాంటి హృదయ విదారక ఘటనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి హనుమాన్ నగర్ లో నాడెం రాజు (70) అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృత్యువాత పడింది. మృతురాలికి ఒక కుమారుడు(నాడెం వెంకటేష్) మరో కూతురు(భీమ లలిత) ఉన్నారు. ఈ ఇద్దరికీ ఎప్పుడో వివాహాలు అయిపోయాయి. కుమారుడి వద్ద ఉంటున్న ఆ వృద్ధురాలు రాజు మరణ వార్త సొంత కూతురు చెవిన కూడా పడింది. ఇక సోమవారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎకాఎకిన అంబులెన్స్ లో వచ్చింది కూతురు లలిత. పాత మంచిర్యాలలో ఉన్న తమ పాత ఇంటిలో వాటా ఇవ్వాలని మంకుపట్టు పట్టింది. కాదని అన్నందుకు తల్లి మృతదేహాన్ని అంబులెన్స్ లో వేసుకుని సాయి హనుమాన్ నగర్ నుండి పాత మంచిర్యాలకు తీసుకెళ్ళింది. ఈ హఠాత్ పరిణామంతో కుమారుడు, కోడలు కలిసి పోలీస్ స్టేషన్ వెళ్ళారు. సీఐ (CI) ప్రమోద్ రావుతో అంతా మొర పెట్టుకున్నారు. ఫిర్యాదు కూడా చేశారు. స్పందించిన సీఐ కూతురు లలితతో ఫోన్ లో మాట్లాడారు. నలుగురైదుగురు కానిస్టేబుళ్లను సాయి హనుమాన్ నగర్ కు పంపారు. అప్పటికే సమయం మధ్యాహ్నం 3:15 గంటలు అయ్యింది.
ఎట్టకేలకు పాత మంచిర్యాల నుండి మళ్ళీ అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకుని రావడంతో నాడెం రాజు అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. మృతురాలి పై ఉన్న బంగారు ఆభరణాల విషయంలో అంగీకారం కుదరడంతో సామరస్యంగా అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం. కన్న కూతురు అయి ఉండి ఆస్తిపాస్తుల కోసం తల్లి మృతదేహంతో ఆటలాడుకోవడం మంచిది కాదని పలువురు వాపోయారు. ఉన్నత చదువులు చదివి కూడా బంగారానికే ప్రాధాన్యత ఇచ్చారు గానీ.. బంగారం కంటే విలువైంది అమ్మ అని గుర్తించలేక పోయారని చర్చించుకున్నారు. రోజురోజుకు మనిషి డబ్బు, ఆస్తుల చుట్టూ వెంపర్లాడుతున్నాడు తప్పా.. మానవ, రక్త సంబంధాల కోసం కాదంటూ కలత చెందారు. ఏదేమైనా.. ఈ హృదయ విదారకర ఘటన కలిచి వేసింది. గుండెల్ని పిండి చేసింది. కాగా ఫిర్యాదులో వివరాలు సరిగ్గా లేవని గుర్తించిన పోలీసులు కేసు నమోదు అంశాన్ని ఇంకా పరిశీలిస్తున్నారు. మంగళవారం మృతురాలు రాజు కుమారుడు వెంకటేష్ తో మాట్లాడిన తర్వాత కేసు గురించి నిర్ణయం తీసుకుంటామని టౌన్ ఎస్సై తిరుపతి ‘ఆంధ్రప్రభ’కు వెల్లడించారు.
