ENG vs AUS | ఛాంపియన్స్ ట్రోఫీలో రికార్డు స్కోర్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే !
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్… భారీ స్కోర్ నమొదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు సాధించింది. అయితే ఈ టోర్నీలో ఇదే హయ్యెస్ట్ స్కోర్ కావడం విశేషం.
కాగా, ఆ జట్టు ఓపెనర్ బెన్ డకెట్.. ఆసీస్ బౌలర్ల బెండు తీశాడు. బౌండరీలతో చెలరేగిన డకెట్… 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 165 పరుగులు సాధించాడు. మరోవైపు జో రూట్ (68) అర్ధ సెంచరీతో రాణించగా… కెప్టెన్ జోస్ బట్లర్ (23) పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్లలో జాఫ్రా ఆర్చర్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 21 పరుగులు చేశాడు.
ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, మార్నస్ లాబుషేన్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక గ్లెన్ మాక్స్‌వెల్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
కాగా, ఈ టోర్నీలో ఇంగ్లండ్ – ఆసీస్ మ్యాచ్ లో రికార్డు స్కోరు నమోదు కాగా.. 352 పరుగుల భారీ లక్ష్యంతో ఆసీస్ ఛేజింగ్ ప్రారంభించనుంది.