TG | ఈ వేసవిలో మాడుపగిలే ఎండలు..!
- ముందస్తు హెచ్చరికలు జారీ
- రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం
ఈ ఏడాది వేసవిలో ఎండలు మాడుపగులగొట్టడం ఖాయమని వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ వేసవిలో పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కాగా.. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడివాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
ఫిబ్రవరిలోనే భాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటలు దాటకముందే తీవ్రమైన ఎండవేడి మొదలవుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.
మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రామగుండంతోపాటు ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3డిగ్రీల మేర పెరిగాయి. గాలిలో తేమ శాతం చాలా తక్కువగా ఉంటోంది. అదే సమయంలో ఈ ఏడాది జనవరిలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
ఫిబ్రవరిలో గడిచిన 13 రోజుల్లో అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ 13 రోజుల్లో 11 రోజులు దేశంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు తెలంగాణలోనే నమోదయ్యాయి. ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణ లోని మహబూబ్ నగర్, భద్రాచలం, ఖమ్మం, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.