దారి దోపిడీ కేసులో అరెస్ట్…

దారి దోపిడీ కేసులో అరెస్ట్…

కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలో చోటుచేసుకున్న దారి దోపిడీ కేసును నాల్గవ పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బంగారుపేటకు చెందిన గిడ్డయ్యను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు. ఈ నెల 7వ తేదీన కర్నూలు 1 టౌన్ పరిధిలోని గడ్డ స్ట్రీట్ నివాసి షైక్ ఖలీల్ బాషా తన సంపత్ నగర్‌లో ఉన్న కార్పెంటర్ షాపులో పని ముగించుకుని రాత్రి ఇంటికి బయలుదేరాడు.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ (నంబర్: AP21 AU 6496) పై ఐరా ఆసుపత్రి నుంచి పాత ఈద్గా వైపు వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి అతని బైక్‌కు అడ్డుగా వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వనందుకు బాధితుడిపై దాడి చేసి, అతని వద్ద ఉన్న రియల్ మీ స్మార్ట్ ఫోన్‌తో పాటు మోటార్ సైకిల్‌ను దోచుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో భాగంగా దొంగిలించబడిన మోటార్ సైకిల్ ఆచూకీని గుర్తించిన పోలీసులు, కోడుమూరు రోడ్‌లోని రిలయన్స్ మార్ట్ సమీపంలో నిందితుడు గిడ్డయ్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించబడిన మోటార్ సైకిల్, రియల్ మీ స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అతనిని న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

Leave a Reply