ప్రగతి దిశగా ముందడుగు వేయండి..

ప్రగతి దిశగా ముందడుగు వేయండి..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : విద్యార్థులు ప్రగతి దిశగా ముందడుగు వేస్తూ ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని, వారి కలలను సాకారం చేసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సూచించారు. కొండపల్లిలోని రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ 15వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రసంగిస్తూ 16 మందితో ప్రారంభమై 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 25 వేల మంది విద్యార్థులతో రవీంద్ర భారతి సంస్థ ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు.

కొండపల్లి రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు సృజనాత్మకత, విలువలతో కూడిన నాణ్యమైన విద్యను బోధిస్తున్నారన్నారు. విద్యార్థులు మార్కులు, ర్యాంకులే కాకుండా మంచి విలువలు, సంస్కారం, కట్టుబాట్లతో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని పిలుపునిచ్చారు. మంచి ఆశయాలు ఏర్పరచుకొని నిబద్ధతతో కృషి చేసి ఉజ్వల భవిష్యత్తును సాధించాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు సమయస్ఫూర్తి, తెలివితేటలు, పట్టుదల, కార్యదీక్ష, ఓర్పు, నిశిత పరిశీలన కలిగి ఉండాలన్నారు. వారి అభిరుచికి అనుగుణంగా ఎంచుకున్న వివిధ రంగాలపై తగిన తర్ఫీదు ఇవ్వాలని అన్నారు. స్కూల్ యాజమాన్యానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థిని, విద్యార్థులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply