ఇద్దరు పసికందులు బలి
సర్కారీ దవాఖానాలో దారుణం
మధ్యప్రదేశ్లో వైద్యుల నిర్లక్ష్యం
( ఆంధ్రప్రభ, ఇండోర్ ప్రతినిధి )
ఓ సర్కారీ దవఖానాలో చిట్టి ఎలుకలు రెచ్చిపోయాయి. ఇద్దరు పసికందుల్ని పొట్టన పెట్టుకున్నాయి. ఈ ఘోరం మధ్యప్రదేశ్ ఇండోర్లో మహారాజా యశ్వంతరావు (ఎంవై) ఆసుపత్రిలోని చోటు చేసుకుంది. ఆ ఎలుకలు చిట్టి పాపలను కాటు వేసిన మాట వాస్తవం. కానీ ఎలుకలు కొరకటంతో ఆ బిడ్డలు చనిపోలేదని ఆసుపత్రి ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా సర్దార్‌పూర్‌కు చెందిన దేవ్‌రామ్, మంజు దంపతుల రెండు నెలల బిడ్డ తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో చికిత్స కోసం మహారాజా యశ్వంతరావు గత మంగళవారం ఆసుపత్రిలోని చేర్పించారు. పాప పరిస్థితి విషమించటంతో నియోనాటల్ ఐసీయూలో ఉంచారు. ఎప్పటికప్పుడు బిడ్డ ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు తల్లిదండ్రులు అల్లాడిపోయారు. కారణమేంటంటే.. ఆ బిడ్డ ఐసీయూలో ఉండటంతో. లోనికి ఎవరినీ అనుమతించరు. ప్రతి సందర్శకుడికి గేట్ పాస్ ఇస్తారు. అది లేకుండా లోపలికి ఎవ్వరూ వెళ్లలేరు. ఆ బిడ్డకు అత్యవసర ఆపరేషన్ చేస్తామని, తరువాత లోనికి అనుమతిస్తామని వైద్యులు చెప్పారు. కానీ శనివారం వరకూ ఆ బిడ్డ జాడ లేదు. ఆమె ఆరోగ్య స్థితి గతి తెలియలేదు. ఈ స్థితిలో స్థానిక గిరిజన కార్యకర్తలను తల్లిదండ్రి కలిశారు. ఎలుక కరచి ఆ శిశువు చనిపోయిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు శిశువులు మంగళవారం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలతో సమాచారం తెలిసింది. జై ఆదివాసి యువ శక్తి (జెవైఎస్) గ్రూపు కార్యకర్తలతో కలిసి ఆసుపత్రి అనుబంధ ఎంజిఎం మెడికల్ కాలేజీ వెలుపల నిరసన చేపట్టారు. తమ బిడ్డ మృతదేహాన్ని ఖననం చేసేది లేదని భీష్మించారు. ఇక ఎంజీఎం మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ అరవింద్ ఘంగోరియా మాట్లాడుతూ, ఆసుపత్రిలో వైఫల్యాలను అంగీకరిస్తూనే మరణానికి కారణం ఎలుక కాటు కాదని నమ్మబలికారు. ఆ బిడ్డను ఎలుక కరిచింది, కాని ఎలుక కాటుతో చనిపోలేదు, ఈ విషయంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు.

