మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : భక్తి ముసుగులో మహిళలకు మత్తు మందు ఇచ్చి శారీరకంగా లోబర్చుకుని నగ్నంగా ఉన్న వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి అందినకాడికి దోచుకున్న ఓ దొంగ స్వామీజీ పోలీసులు పట్టుకొని అరెస్టు చేసిన సంఘటన మెదక్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వేములవాడ జిల్లా అనుపురం గ్రామానికి చెందిన బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి అలియాస్ శివ స్వామి మెదక్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ జ్యోతిష్యం చెప్తూ పూజలు చేస్తుండేవాడు. వేములవాడకు చెందిన జ్యోతిష్యం శివ స్వామి పేరిట విజిటింగ్ కార్డు పంచుతూ సంచరిస్తున్నాడు.
అందమైన మహిళలు తమ సమస్య పరిష్కరించాలని అతడి వద్దకు వస్తే వారికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని పూజలు చేయాలని నమ్మబలికే వాడు. పూజ సమయంలో నిమ్మకాయ, పసుపు, కుంకుమ వాసనలు చూపిస్తూ నీటిలో నిద్ర మాత్రలు కలిపి తాగించి, మహిళలు సృహ కోల్పోయాక శారీరకంగా అనుభవించి సెల్ ఫోన్ లో నగ్న వీడియోలు చిత్రీకరించే వాడు. ఆ తర్వాత కొంత కాలానికి సదరు మహిళలకు ఫోన్ చేసి నగ్నంగా ఉన్న వీడియోల విషయం చెప్పి బ్లాక్ మెయిల్ పాల్పడి మహిళల ఆర్థిక స్తోమతను బట్టి డబ్బులు డిమాండ్ చేసి వసూల్ చేసి జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.
ఇదే క్రమంలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్ తదితర ప్రాంతాల్లో ఇదే తరహాలో దొంగ స్వామీజీ వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. బ్లాక్ మెయిల్ తో ఐ ఫోన్, కార్లు వినియోగం లాంటి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న స్వామీజీ లీలల పై బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు నర్సాపూర్ లో స్వామిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపి సెల్ ఫోన్ లోని మహిళల నగ్న వీడియోలు, బ్లాక్ మెయిల్ చేసి వసూల్ చేసి ఆన్ లైన్ వివరాలను పోలీసులు గుర్తించారు. స్వామీజీ నుంచి మంత్రాల సామాగ్రితో పాటు షర్న కోల, పసుపు, కుంకుమ, గజ్జెలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.