Rare Judgement | వివాహేతర సంబంధం నేరం కాదు – ఢిల్లీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

ఢిల్లీ – వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడాల్సిన అవసరం లేదని, అది నైతికతకు సంబంధించిన అంశమంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఓ వ్యక్తి భార్య ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు విముక్తి కలిగించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఓ హోటల్‌లో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు. ఈ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని విడిచిపెట్టేసింది. దీంతో బాధిత భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు ప్రియుడికి సమన్లు పంపింది. దీనిని అతడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు. అక్కడ కూడా అతడికి అనుకూలంగానే తీర్పు వచ్చింది.

ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి కాలం చెల్లిందని పేర్కొంది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497 సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఉటంకించారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దానిని నేరంగా చూడటం సరికాదని స్పష్టం చేస్తూ భార్య ప్రియుడికి ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *