Ranji | నేటి నుంచే రంజీ నాకౌట్‌ సమరం

ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25 నాకౌట్‌ దశకు చేరుకుంది. నేటి నుంచి రంజీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌ దశలో అద్భుతంగా ఆడినా ఎనిమిది జట్లు (ముంబై, హర్యానా, సౌరష్ట్ర, విదర్భ, కేరళ, జమ్మూ అండ్‌ కశ్మీర్‌, గుజరాత్‌, తమిళనాడు) నాకౌట్‌కు అర్హత సాధించాయి.

ఈ జట్లలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై మళ్లి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 42 సార్లు రంజీ ట్రోఫీని ముద్దాడిన ముంబై జట్టు మరో టైటిల్‌ వేటకు సిద్ధమైంది. నేడు కోల్‌కతా వేదికగా ముంబై-హర్యానా జట్ల మధ్య క్వార్టర్‌ పోరు జరగనుంది. ఇక ముంబై జట్టులో చాలా మంది టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు.

ఈ జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహిస్తున్నాడు. భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇతడితో పాటు పేస్‌ ఆల్‌రౌండర్లు శార్దుల్‌ ఠాకూర్‌, శివమ్‌ దూబే వంటి స్టార్‌ ఆటగాళ్లతో ముంబై జట్టు పటిష్టంగా ఉంది.

మరోవైపు, ఈ మెగా టోర్నీలో జమ్మూ అండ్‌ కశ్మీర్‌ జట్టు ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. లీగ్‌ దశలో పటిష్టమైన ముంబై జట్టును 5 వికెట్లతో ఓడించి సంచలనం సృష్టించింది. గ్రూప్‌-ఏ నుంచి జమ్మూ జట్టు 35 పాయింట్లతో ముంబై (29 పాయింట్లు)ను వెనక్కినెట్టి అగ్ర స్థానంలో నిలిచి నాకౌట్‌కు దూసుకెళ్లింది.

ఈ గ్రూప్‌లో బరోడ వంటి మరో పెద్ద జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుని నాకౌట్‌ సమరానికి దూరమైంది. లీగ్‌ దశలో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన జమ్మూ ఐదింట్లో విజయాలు సాధించి రికార్డు సృష్టించింది.

మరో రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకున్న జమ్మూ ఒక మ్యాచ్‌లోనూ ఓడిపోకపోవడం విశేషం. మరోవైపు రెండో స్థానంలో నిలిచిన ముంబై ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించింది. మరో రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన ముంబై మరొక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

ఇక గ్రూప్‌-బి నుంచి విదర్భ, గుజరాత్‌ జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించగా.. గ్రూప్‌-సి నుంచి హర్యానా, కెరళా జట్లు నాకౌట్‌కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్‌-డి నుంచి సౌరష్ట, తమిళనాడు జట్లు క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ పోటీల్లో తెలుగు రష్ట్రాల తెలంగాణ, ఆంధ్ర జట్లు లీగ్‌ స్టేజ్‌ను దాటలేక పోయాయి.

గ్రూప్‌-బిలో బరిలోకి దిగిన హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలవగా.. అదే గ్రూప్‌లో ఉన్న ఆంధ్ర జట్టు ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

మ్యాచ్‌ల వివరాలు

తొలి క్వార్టర్‌ ఫైనల్‌: జమ్ము కశ్మీర్‌ – కేరళ (పూణే)
రెండో క్వార్టర్‌ ఫైనల్‌: విదర్భ – తమిళ్‌నాడు (నాగ్‌పూర్‌)
మూడో క్వార్టర్‌ ఫైనల్‌: ముంబై – హర్యానా (కోల్‌కతా)
నాలుగో క్వార్టర్‌ ఫైనల్‌: గుజరాత్‌ – సౌరష్ట్ర (రాజ్‌కోట్‌)
(మ్యాచ్‌లన్ని ఉదయం 9:30 నుంచి ప్రారంభమవుతాయి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *