తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్, ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో మిత్ర బృందంతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈసందర్భంగా ఆలయం వెలుపల చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ మీడియాతో మాట్లాడుతూ…. ఫిబ్రవరి 7తేదీన తనపై జరిగిన భయంకరమైన దాడి నుంచి ఆ స్వామి తనను కాపాడారని, స్వామి పాదపద్మములకు నమస్కరించాలని తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామి వారి కళ్ళలో అనుగ్రహం కనిపించిందన్నారు. స్వామి వారి హుండీ కానుకలను ఇతర కార్యక్రమాలకు వాడకుండా ఆధ్యాత్మిక విషయాలు పెంపొందించే రీతిలో, సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని సూచించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో మిత్ర బృందంతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈసందర్భంగా ఆలయం వెలుపల సుమన్ మీడియాతో మాట్లాడుతూ… ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నట్లు సుమన్ తెలిపారు. రాజకీయం, సినిమా, ప్రజలు క్షేమంగా ఉండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. హిందీ, తెలుగులో విడుదల కానున్న కాంత అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. ధర్మస్థల నియోజకవర్గం అనే సినిమాలో మరో పాత్ర పోషిస్తున్నట్లు తెలిపిన ఆయన…. కన్నడ, మలయాళం సినిమాల్లో అనేక ప్రధాన పాత్రలు పోషిస్తున్నానన్నారు. ఇతర భాషల్లోని సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నానన్నారు. అన్నమయ్య, శ్రీ రామదాసు, శ్రీ సత్యనారణాయణ స్వామి వ్రతం వంటి సినిమాలు నటించి…. దైవిక పాత్రలు పోషించినట్లు తెలిపారు. తాను అనుకున్న దాని కన్నా దేవుడు చాలా ఎక్కువ ఇచ్చాడని, ఇందుకు తన తల్లితండ్రులు చేసిన పుణ్యమే కారణమన్నారు.