Random check | నాణ్యమైన వైద్య సేవలు అందాలి

Random check | నాణ్యమైన వైద్య సేవలు అందాలి
- చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
Random check | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అత్యవసర విభాగాలు, వివిధ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎంపీ, రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న సేవల నాణ్యత, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తనిఖీ అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ఎంపీ, ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజల నమ్మకానికి నిలబెట్టేలా సమగ్ర అభివృద్ధి చేపట్టాలని సూచించారు. ఆధునిక యుగానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆధునిక వైద్య విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి సమయోచితంగా, సమర్థవంతమైన చికిత్స అందించాలన్నారు.
ముఖ్యంగా సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి, వాటి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆశయాలను దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేసి, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఆసుపత్రి నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
