Rajasthan | కోటాలో రాలిన మ‌రో విద్యా కుసుమం…

కోటా: రాజస్థాన్‌లో కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా నీట్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నది. జమ్ముకశ్మీర్‌కు చెందిన జీషన్‌ అనే విద్యార్థిని కోటాలోని ప్రతాప్‌ చౌరహా అనే ప్రాంతంలోని హాస్టల్‌ పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటూ వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్నది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తానుంటున్న రూమ్‌లోనే ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. అయితే అంతకుముందు తన బంధువులతో ఫోన్‌లో మాట్లాడిందని, తాను చనిపోతున్నానని చెప్పిందని పోలీసులు వెల్లడించారు.

దీంతో ఆమె వెంటనే అదే బిల్డింగ్‌లో పై అంతస్తులో ఉంటున్న మమత అనే మరో విద్యార్థినికి విషయం చెప్పారని తెలిపారు. ఆమె జీషన్‌ గదికి వెళ్లి చూడగా అప్పటికే తలుపులు లాక్‌ చేసుకుందని, మమత అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి వాటిని బద్దలుకొట్టారని, అయితే అప్పటికే ఆమె సీలింగ్‌కు వేలాడుతూ కనిపించిందని వెల్లడించారు. దీంతో వారు జీషన్‌ను హుటాహుటిన దవాఖానకు తరలించారని, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారమన్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు కోటాలో 15 మంది విద్యార్థులు చనిపోగా, ఈ నెలలో ఇది రెండో మరణం.

ఈ ఏడాదిలో 14వ ఆత్మ‌హ‌త్య ..
విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఇటీవ‌ల‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం మే 23 నాటికి కోటాలో 14 ఆత్మహత్యలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

Leave a Reply