- మూడు రోజులపాటు సమావేశం
- 125 దేశాల నుండి 3,500 మందికి పైగా ప్రతినిధులు
భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘రైసినా డైలాగ్’ సదస్సు రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఢిల్లి వేదికగా (సోమవారం) ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 125 దేశాల నుంచి దాదాపు 3500 మంది ప్రతినిధులు హాజరవుతారు.
ఈ సదస్సును భారత విదేశాంగ శాఖ భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్‌ఎఫ్) నిర్వహిస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చకు వేదికగా రైసినా డైలాగ్ సదస్సు నిలువనుంది. ‘కాల చక్ర -ప్రజలు, శాంతి, భూగ్రహం’ అనే థీమ్‌తో ఈసారి సదస్సును నిర్వహిస్తున్నారు.
పదోసారి జరగనున్న ఈ సదస్సుకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్, యూఎస్ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా తదితర ప్రముఖులు విచ్చేయనున్నారు. న్యూజిలాండ్ ప్రధాని కీలకోపన్యాసం చేయనున్నారు.
తైవాన్‌కు చెందిన ఓ సీనియర్ భద్రతా అధికారి సారథ్యంలోని టీమ్ కూడా ‘రైసినా డైలాగ్’ సదస్సుకు విచ్చేయనుంది. 125 దేశాలకు చెందిన మంత్రులు, మాజీ ప్రభుత్వాధినేతలు, మిలిటరీ కమాండర్లు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు సహా దాదాపు 3,500 మందికిపైగా ఇందులో పాల్గొని కీలక అంశాలను చర్చించబోతున్నారు.
సదస్సు ఎజెండా ఇదే..
‘రైసినా డైలాగ్’ సదస్సులో ప్రధానంగా 6 అంశాలపై మూడు రోజుల పాటు సమగ్రంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ రాజకీయ సవాళ్లు, ఆర్థిక, వాణిజ్య, రాజకీయపరమైన వ్యవహారాల్లో ప్రతిష్ఠంభనకు పరిష్కారాలపై చర్చలు జరగనున్నాయి. డిజిటల్ యుగంలో ప్రపంచ దేశాల నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు, వాటి ఉన్నతాధి కారులు డిజిటల్‌గా సమన్వయం చేసుకునేలా వ్యవస్థల ఏర్పాటుపై చర్చిస్తారు.
అలాగే ఉగ్రవాదం కట్టడిపై ఉమ్మడి వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. ప్రగతి పయనంలో కలిసికట్టుగా నడవాలనే భావనపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. ఇందుకోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ప్రపంచ శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.