తెలంగాణలో మరో నాలుగు రోజులు..

హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంపై వరుణుడు పగ పట్టినట్లున్నాడు. గత కొన్ని రోజులుగా వదలకుండా వానలు (rains) పడుతున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో పాటు క్యూములోనింబస్ (Cumulonimbus) కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది.
ఇవాళ సోమవారం ( అక్టోబరు 6) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు మెదక్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, కరీంనగర్, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ములుగు, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, జనగామ, హనుమకొండ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
