రైల్వే స్టేషన్‌లలో పోలీసుల విస్తృత తనిఖీలు…

రైల్వే స్టేషన్‌లలో పోలీసుల విస్తృత తనిఖీలు…
రామగుండం, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగం అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా రైల్వే స్టేషన్‌లో స్థానిక పోలీసులు, నార్కోటిక్ ట్రైనింగ్ స్నిఫర్ డాగ్, స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ సర్వీస్ కేంద్రాలు, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణించే రైల్వే బోగీలు, అనుమానాస్పదంగా కనిపించే ప్రతి పార్సిల్, రవాణా బ్యాగులు, ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వం నిషేధించిన ఉత్పత్తుల రవాణాను అరికట్టే క్రమంలో ఈరోజు రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు, గంజాయి పంటల సాగు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇప్పటికే విక్రయదారులపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి,వారిపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.మంచిర్యాల జిల్లాకు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి రైల్వే మార్గం ద్వారా గంజాయి రవాణా జరిగే అవకాశం ఉన్నందున విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు ఏసీపీ మడత రమేష్ తెలిపారు. ఈ తనిఖీలలో రామగుండం సీఐ ప్రవీణ్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐ రమేష్, అంతర్గం ఎస్‌ఐ వెంకట స్వామి, ఎన్టీపీసీ ఎస్‌ఐ లచ్చన్న,సర్కిల్ పోలీసులు,స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
