హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల్లోదాల్మియా సిమెంట్స్ కు ఈడీ భారీ షాకిచ్చింది. .గతంలో వైఎస్ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలోని 417 హెక్టార్ల సున్నపురాయి గనుల్ని దాల్మియా సిమెంట్స్ కు లీజుకు అప్పగించింది. ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ లీజులు పొందేందుకు అప్పట్లో దాల్మియా సిమెంట్స్ జగన్ సాయం తీసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది.
దీనిపై ఇప్పటికే ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్ కు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తుల్ని ఇవాళ ఈడీ అటాచ్ చేసింది.దాల్మియా సిమెంట్స్ అప్పట్లో జగన్ కు ఈ లీజు ఇప్పించినందుకు ప్రతిఫలంగా రూ.150 కోట్ల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
ఇందులో దాల్మియా సిమెంట్స్ మరో సంస్థ రఘురామ్ సిమెంట్స్ లో 95 కోట్ల విలువ చేసే షేర్లతో పాటు 55 కోట్లు హవాలా మార్గాల్లో జగన్ కు చెల్లించినట్లు అభియోగాల్లో తెలిపింది. దీంతో మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ దాల్మియా సిమెంట్స్ ఆస్తుల్ని అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే సీబీఐ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే ఇందులో విచారణ కూడా నానాటికీ ఆలస్యమవుతోంది. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఈడీ అటాచ్ మెంట్ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న కేసులపై విచారణ వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు.