పుష్కర ఘాట్ల రోడ్లు సమయానికి పూర్తి చేయాలి

పుష్కర ఘాట్ల రోడ్లు సమయానికి పూర్తి చేయాలి
- కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి: పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్‌తో కలిసి ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మంథని, గోలివాడ, గోదావరిఖని పుష్కర ఘాట్లకు వెళ్లే రోడ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల సమయంలో గోలివాడ సమ్మక్క-సారలమ్మ జాతరకు రోజుకు సుమారు 30 వేల మంది భక్తులు వచ్చే అవకాశముందని, దీనిని దృష్టిలో ఉంచుకుని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు.
గోదావరిఖని సమ్మక్క-సారలమ్మ జాతర వద్ద ఇప్పటికే 50 శాతం శాశ్వత పనులు పూర్తయ్యాయని, స్నాన ఘాట్, కళ్యాణ కట్ట, పిండప్రదానం చేసే స్థలాల ఏర్పాట్లు రోజుకు లక్ష మంది భక్తులు వచ్చినా సరిపడేలా ఉండాలని సూచించారు. సుందిళ్లలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద రోడ్ల మరమ్మత్తులు చేపట్టి, బ్యారేజ్ వద్ద రహదారిని డబుల్ లైన్ చేయాలని ఆదేశించారు.
మంథని గౌతమేశ్వర ఆలయం వద్ద గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు రెండు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశముందని పేర్కొంటూ, సురబండేశ్వర్ స్వామి ఆలయం నుంచి శివాలయం వరకు ఉన్న ఘాట్ వద్ద ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సక్రమంగా ఏర్పాటు చేయాలని చెప్పారు.
మంథని పట్టణంలోని అన్ని దేవాలయాలకు అంతర్గత రహదారులు నిర్మించాలని, పుష్కర ఘాట్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ బావ్ సింగ్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
