హైదరాబాద్, ఆంధ్రప్రభ : పరమ ఋషుల పవిత్రస్తోత్రాలతో పురాణపండ శ్రీనివాస్ అమృతప్రాయంగా అందించిన వ్యాఖ్యానాలతో, పరమాద్భుతమైన కథలతో అమృతకలశంలా వేలవేలమందికి చేరి విమర్శకులచే కూడా ప్రశంసలు వర్షింప చేసిన అపురూపగ్రంథం శ్రీమాలిక.
ఈ గ్రంథం 25వ ఎడిషన్ రాష్ట్ర రాజధాని నుండి దేశ రాజధాని వరకూ పవిత్రంగా సంచలనం సృష్టిస్తూ అనుగ్రహిస్తూనే ఉండటం ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ప్రతిభకు ఒక సత్కీర్తి పతాకమై రెపరెపలాడుతోందనడం నిస్సందేహంగా అంగీకరించాల్సిన అంశమని కొందరు సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అభినందనలు వర్షిస్తున్నారు.
400 పేజీల శ్రీమాలిక మహోత్తమ గ్రంథంలో నృసింహ ఆవిర్భావఘట్టాన్ని తాను చదువుతున్నప్పుడు ఒళ్లు గగుర్పొడిచిందని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి పేర్కొనడం ఈ గ్రంథ వైభవాన్ని తెలియజేస్తోందని శృంగేరి మహాక్షేత్ర చండీ ఉపాసక పండితుడు శంకరమఠం నిమ్మకంటి శ్రీనివాస్ శర్మ పేర్కొన్నారు.
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో ఇరవై ఒక్క ప్రచురణగా తెలుగుజాతికి అందిన శ్రీమాలిక అద్భుత గ్రంథాలను అమరావతి జనసేన పార్టీ కార్యాలయంలో వందల మంది జనసేన కార్యకర్తలకు, నేతలకు అక్కడి నిర్వాహకులు పంచడం కనులముందు కనిపిస్తున్న దృశ్యం.
ఇటీవల ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కు త్యాగరాయ గానసభ అధ్యక్షులు, నిరంతర కళల సేవా పిపాసి కళా జనార్ధనమూర్తి శ్రీమాలికను జ్ఞాపికగా బహూకరించగా, శైలజ రామయ్యర్ ఆసక్తిగా ఈ మంత్రగ్రంథాన్ని పరిశీలించి పురాణపండ శ్రీనివాస్ ఆర్ష భారతీయతకు చేస్తున్న నిస్వార్ధ సేవను, ఈ గ్రంథంలోని రమణీయతను, కమనీయతను అభినందించారు. ఈ గ్రంథాన్ని బహూకరించిన కళా జనార్ధన మూర్తితో ఆధ్యాత్మిక సంభాషణ చేయడం అభినందనీయం.
కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు డాక్టర్ జయంతిరెడ్డి, డాక్టర్ జయరాంరెడ్డి, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పీపుల్ మీడియాకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత వివేక్ కూచిభట్ల, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, విజయవాడ శాసన సభ్యులు సుజనా చౌదరి వంటి ఎందరో ప్రముఖులు అనేక ప్రచురణలు సమర్పించిన ఈ పవిత్ర గ్రంధం శ్రీమాలిక ఇప్పటికే దేశాల ఎల్లలు దాటి వేలాది భక్త పాఠకుల్ని ఆకర్షించిందనేది స్పష్టంగా దర్శనమిస్తున్నసత్యమని మేధో సమాజం సైతం గొంతెత్తి చెబుతోంది.
ఈ దేవీ నవరాత్రుల్లో హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానం ఆలయంలో ప్రత్యేకపూజల్లో పాల్గొనే భక్తులకు ప్రముఖ నిర్మాత, సాయి గణేష్ ప్రొడక్షన్స్ అధినేత బెల్లంకొండ సురేష్ దంపతుల సమర్పణలో ఈ శ్రీమాలిక గ్రంథాన్ని అందిస్తున్నట్లు ఇప్పటికే ఆలయ వర్గాల సమాచారం. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానం దాతలకు, ప్రత్యేక ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఈ శరన్నవ రాత్రోత్సవాల్లో పురాణపండ శ్రీనివాస్ శ్రీనివాస్ అఖండ గ్రంథమైన శ్రీమాలికను కేంద్ర మాజీమంత్రి, విజయవాడ పశ్చిమ శాసన సభ్యుడు సుజనాచౌదరి, పద్మ దంపతులు దుర్గమ్మవారి అనుగ్రహంగా సమర్పిస్తుండటం విశేషమని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ అయిన కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.



