Publicity | రెండేళ్లలో రూ.1035కోట్ల నిధులు తీసుకొచ్చా

Publicity | రెండేళ్లలో రూ.1035కోట్ల నిధులు తీసుకొచ్చా

  • సీఎం సహకారంతో 23 వేల ఎకరాలకు సాగునీరు
  • జీవో.69తో మారనున్న ఊట్కూర్ రూపురేఖలు
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
  • స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభిస్తా
  • ఆరు గ్యారంటీ పథకాలు గ్యారెంటీగా అమలుచేసి తీరుతాం
  • సుజాత యగ్నేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే అదనంగా నిధులు మంజూరు చేస్తా
  • రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

Publicity | ఊట్కూర్, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రెండేళ్ల పాలనలో మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1035 కోట్ల నిధులు తీసుకువచ్చానని రాష్ట్ర పాడి పరిశ్రమల, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టంచేశారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి పదవి ఇవ్వడంతో నాపై బాధ్యత మరింత పెరిగిందని విరివిగా నిధులు తీసుకువచ్చి వలసలు నివారిస్తానన్నారు.

నారాయణపేట -కొడంగల్ పథకంతో 23 వేల ఎకరాలకు సాగునీరు తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేస్తానన్నారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దంతాన్ పల్లి సుజాత యగ్నేశ్వర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టి కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. మంత్రి ప్రచారానికి మహిళలు, యువకులు, బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు గ్యారెంటీగా అమలు చేసి తీరుతామన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రూ.4500 కోట్లు నిధులు కేటాయించారని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే రైతులు, కూలీలకు చేతినిండా పని లభించడంతో పాటు బీడు భూములకు సాగునీరు అందించి రైతులను రాజుగా చూడడమే తమ లక్ష్యమన్నారు.

మరో మూడేళ్లలో ఎవరూ ఊహించని విధంగా మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి చేయడంతో పాటు వెనుకబడిన ఊట్కూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఉచిత బస్సు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఉచిత విద్యుత్ మంజూరు చేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చామన్నారు. ఊట్కూర్ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుజాత యజ్ఞేశ్వర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఊట్కూర్ మండలానికి 500 ఇండ్లు మంజూరు చేయగా, మరో వెయ్యి ఇండ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. నారాయణపేట – మక్తల్ ఆర్ అండ్ బి రహదారి పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి రూ.210 కోట్ల నిధులతో పనులకు శ్రీకారంచుట్టారని గుర్తు చేశారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని జీవో .69తో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం పెంచడం జరిగిందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. కాటన్ మిల్లు ప్రారంభించాలని ప్రజలు కోరగా, పునః ప్రారంభించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని సీఎం సహకారంతో నిధుల వరద తీసుకురావడంతో ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ప్రజలు ఓట్లతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న మూడేళ్లలో ప్రతి పల్లెకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు అర్హులందరికీ ఇండ్లు, పింఛన్లు మంజూరు చేస్తానని, ఊట్కూర్ లో క్రీడా మైదానానికి రూ.3కోట్లు మంజూరు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ నూతన భవనం నిర్మాణం చేస్తానని వెల్లడించారు.

పార్టీలకతీతంగా అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములై గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు బాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మణెమ్మ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎల్కోటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీలు గోవిందప్ప, శివరామరాజు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్, మైనార్టీ మండల అధ్యక్షులు జలాల్, పట్టణ అధ్యక్షులు లింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply