Public meeting | పేదలకు అండగా ఎర్రజెండా

Public meeting | పేదలకు అండగా ఎర్రజెండా
- కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటించాలి…
- 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శతాబ్ది సభను జయప్రదం చేయండి
- సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్
Public meeting | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం నగరంలో జనవరి 18న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా సీపీఐ కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్ కోరారు. ఇవాళ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి లేని ఈ వందేళ్ళ చరిత్ర ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే దక్కుతుందన్నారు.
దేశ స్వాతంత్రం కోసం అనేకమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అనేక పోరాటాలు త్యాగాలు నిర్బంధాలు ఎదుర్కొని బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమికొట్టిన చరిత్ర ఒక సీపీఐకే ఉందన్నారు. నేటి వరకు పేద ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిందని వెల్లడించారు. ఉపాధిహామీలో గాంధీ పేరును మార్చడాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్ వ్యతిరేకించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే విధంగా కుట్ర చేస్తుందని ఆరోపించారు.
గతంలో వంద రోజుల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. అందుకు భిన్నంగా 60శాతం కేంద్రం, రాష్ట్రం 40శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాల పై ఆర్థిక భారం మోపుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సీపీఐ సుభాని, సీపీఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, ఏరియా సహాయ కార్యదర్శి బొంతా ధన్రాజ్ పాల్గొన్నారు.
