ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం..

  • పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు…
  • పేదలకు ఉచిత వైద్యం, విద్యే లక్ష్యం
  • కళాశాలల యాజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే
  • ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య..

ఆంధ్రప్రభ, నందిగామ: ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని, అసత్య ఆరోపణలను నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తీవ్రంగా ఖండించారు.

అజ్ఞానం, బాధ్యతారాహిత్యం, రాజకీయ స్వార్థం తప్ప వైసీపీ చేసిన ఆందోళనలో మరొకటి కాదని ఆమె స్పష్టం చేశారు. పీపీపీ అంటే ‘ప్రైవేటీకరణ’ కాదు. ఇది గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ, పనులు వేగంగా పూర్తి చేసి, పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించడానికి తీసుకున్న దూరదృష్టితో కూడిన నిర్ణయం అన్నారు.

పీపీపీ విధానం ప్రజలకు లభించే ప్రధాన ప్రయోజనాలను ప్రతిపక్షం వక్రీకరిస్తున్నట్లు కాకుండా, పీపీపీ విధానం ద్వారా ప్రజలకు లభించే వాస్తవ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ఆమె తెలిపారు.

కళాశాలల యాజమాన్య హక్కులు 100% ప్రభుత్వానివేనని, ప్రైవేట్ భాగస్వాములు కేవలం 33 సంవత్సరాలపాటు నిర్వహణ మాత్రమే చేపడతారని, ఒక్క అంగుళం భూమి కూడా అమ్మబడదన్నారు. కొత్త కళాశాలల్లోని మొత్తం సీట్లలో 50% సీట్లు (కన్వీనర్ కోటా) పేద, మధ్యతరగతి విద్యార్థులకు పూర్తి ఉచితంగా లభిస్తాయని తెలిపారు.

ఆసుపత్రులలోని 70% పడకలు డా. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచిత చికిత్స కోసం కేటాయించబడతాయని, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా నిర్మాణాలు ఆలస్యం కాకుండా, అత్యాధునిక మౌలిక వసతులు సమయానికి పూర్తవుతాయని ఆమె చెప్పారు.

మెడికల్ కాలేజీలతో పాటు అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ రంగాల్లో వేలాది ఉద్యోగావకాశాలు స్థానిక యువతకు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. 17 కొత్త కాలేజీల కోసం కేటాయించిన రూ.8,480 కోట్లలో గత ప్రభుత్వం కేవలం రూ.1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన నిధులను దారి మళ్లించి, నిర్మాణాలను ఎందుకు అసంపూర్తిగా వదిలేసిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రజా ప్రయోజనాల ముందు వైసీపీ రాజకీయ స్వార్థం నిలబడదని, వైద్య రంగంలో పారదర్శకత, సమర్థత, వేగం కలిగిన ఈ సహకారం ద్వారానే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు.

Leave a Reply