Public examination | 9వేల విద్యార్థులు తిరిగి బడికి…

Public examination | 9వేల విద్యార్థులు తిరిగి బడికి…
- బాల్యవివాహం వద్దని చెప్పండి
- జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
Public examination | కర్నూలు బ్యూరో. ఆంధ్రప్రభ : రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెంచేందుకు విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. బుధవారం గోనెగండ్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు.
విద్యార్థులు క్రమ శిక్షణతో చదివి, మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం సాయంత్రం వేళల్లో గంట లేదా గంటన్నర పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల మార్కులను క్రమం తప్పకుండా యాప్లో అప్లోడ్ చేసేలా తీసుకోవాలన్నారు.
అనంతరం కలెక్టర్ వంట గదిని పరిశీలిస్తూ కూరగాయల నాణ్యత సరిగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు..వంట సిబ్బందిని మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.పాఠశాలలో పారిశుధ్యం నిర్వహణ, టాయిలెట్ మెయింటెనెన్స్ , మిడ్ డే మిల్స్ సక్రమంగా ఉండాలన్నారు. తల్లి తండ్రులు పెళ్లి చేసుకోమని వత్తిడి చేస్తే బాల్య వివాహం వద్దని చెప్పాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ..పాఠశాలలో టాయిలెట్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, త్వరితగతిన మరమ్మతుల పనులు చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో వలస వెళ్ళిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం జరిగిందన్నార.
గత సంవత్సరాల ఫలితాలను సబ్జెక్ట్ వారీగా విశ్లేషించి తక్కువ ఉత్తీర్ణత శాతం ఉన్న విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సమిష్టి కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డి ఈ ఓ సుధాకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ప్రసూన, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
