పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
కర్నూలు బ్యూరో, నవంబర్ 3, ఆంధ్రప్రభ : మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సంఘాలపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐసా జాతీయ కమిటీ సభ్యులు ఏ.నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… మెడికల్ కాలేజీలను 66 సంవత్సరాల పాటు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా విద్యను వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. పేద, మధ్యతరగతి, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ముసుగులో ప్రజల సొమ్ముతో నిర్మించిన విద్యా సంస్థలను కార్పొరేట్లకు అప్పగించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు.
అలాగే, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాలపై నిషేధం విధించడం విద్యార్థుల హక్కులపై దాడితో సమానమని పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాన్ని ప్రభుత్వం హరించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం మరింత అన్యాయమని తెలిపారు.
తక్షణమే పీపీపీ విధానాన్ని రద్దు చేసి, విద్యార్థి సంఘాలపై నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐసా నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఆందోళనలు చేపట్టితమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా నాయకులు పవన్, రాము, సూర్య తదితరులు పాల్గొన్నారు.

