సాగు నీరు ఇవ్వాలని రైతుల డిమాండ్

సాగు నీరు ఇవ్వాలని రైతుల డిమాండ్

కెనాల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
ఆరేళ్లుగా పూర్తి కాని డీసీ–3 ఎల్‌ఎంసీ కెనాల్
ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
సాగునీరు లేక వేల ఎకరాలు ఎండబారిన పరిస్థితి

నర్సంపేట, రూరల్,ఆంధ్రప్రభ: ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో గత ఆరు సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి కాక డీసీ–3 ఎల్‌ఎంసీ కెనాల్ పనులు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందక పంటలు వేసుకోలేని దుస్థితి నెలకొన్నదని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నర్సంపేట మండలం ఇటుకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల డీసీ–3 లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను రైతు కూలీ సంఘం నాయకులు, రైతులు పరిశీలించి కెనాల్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఈర్ల పైడి మాట్లాడుతూ నర్సింగాపురం, ఇటుకలపల్లి, నారక్కపేట గ్రామాలకు చెందిన రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

దేవాదుల ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్యాకేజీ–5లో భాగంగా డీసీ–3 ఎల్‌ఎంసీ కెనాల్ నిర్మాణాన్ని ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించారని తెలిపారు. నల్లబెల్లి మండలం నారక్కపేట, గొల్లపల్లి, మేడపల్లి, ఇటుకాలపల్లి, ఆకుల తండా, ముతోజీపేట, రాజుపేట గ్రామాల వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ కెనాల్ నిర్మాణం చేపట్టినప్పటికీ, సంబంధిత ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశారని విమర్శించారు. దీంతో వేల ఎకరాల వ్యవసాయ భూములు సాగునీరు లేక బీడుబారుతున్నాయని, రైతులు నిరాశలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే కెనాల్ నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు గొర్రె మొగిలి, వాడుకారి చందర్రావు, భూసాని నరసింహస్వామి, భర్తీపాక మధు, నూకలమర్రి మహేందర్, బాలాజీ, ఇటుకాలపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఈర్ల అనిల్ కుమార్, లింగదారి శంకర్, రైతులు చెన్నమల ఆలోచన, ఓదెల ఐలయ్య, ఓదెల అశోక్, జన్ను మధు, ఎదునూరి కుమారస్వామి, సోనబోయిన కుమారస్వామి, మండల రాజు, ఎదురబోయిన మహేష్, బూస విజేందర్, లింగదారి విజేందర్, పోగుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply