ఉత్తరాంధ్రకు ఉక్కు బలం…

ఉత్తరాంధ్రకు ఉక్కు బలం…
ఆర్సెలర్ మిట్టల్ మెగా ప్లాంట్‌తో అభివృద్ధి దిశగా భారీ అడుగు
ప్రభుత్వ విప్ బోండా ఉమ
పాయికాపురం , ఆంధ్రప్రభ : ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలక మలుపుగా నిలిచే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ స్థాపనపై ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌టీఎస్ రోడ్డులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను వివరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పరిధిలో ఏర్పడనున్న ఈ మెగా ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక రంగ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇది కేవలం ఒక పరిశ్రమ కాకుండా ఉత్తరాంధ్ర ఆర్థిక, సామాజిక రూపురేఖలను మార్చే శక్తిగా మారుతుందని పేర్కొన్నారు. సుమారు రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ ద్వారా వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షలాది పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించి, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పరిశ్రమలపై ఉన్న స్పష్టమైన విధానం, అలాగే మంత్రి నారా లోకేష్ కృషి, పెట్టుబడిదారులతో సమన్వయం వలన ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. “జాబ్స్ ఫస్ట్” విధానంతో యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని, ఈ స్టీల్ ప్లాంట్ ఆ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, శిక్షణ కార్యక్రమాలు, అనుబంధ పరిశ్రమల ద్వారా యువతకు మరింత అవకాశాలు అందనున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అమలుతో రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఎంఎస్ఎంఈలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు విస్తరించి స్థానిక వ్యాపారాలకు ఊతం లభిస్తుందని అన్నారు.
సుమారు 5,465 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ తొలి దశలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమై, తరువాతి దశలో 10.5 మిలియన్ టన్నులకు విస్తరించనుందని వివరించారు. భవిష్యత్తులో మరింత విస్తరణతో రాష్ట్రాన్ని ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపనున్నదని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు పెట్టుబడులు మరింతగా ఆకర్షితమై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దేశంలో ముందంజలో నిలుస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు.
