project | డ్రీమ్ ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించండి

project | డ్రీమ్ ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించండి
జిల్లా పరిషత్ నుంచి తొలగించి సత్యసాయి ప్రాజెక్ట్‌లోనే కొనసాగించండి
596 మంది కార్మికులకు న్యాయం చేయాలి
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
project | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో త్రాగునీటి కొరతను తీర్చేందుకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆవిష్కరించిన సత్యసాయి త్రాగునీటి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కోరారు. విజయవాడ–అమరావతిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సత్యసాయి గ్రామీణ త్రాగునీటి పథకంలో నెలకొన్న సమస్యలను ఆమె ప్రస్తావించారు. రాయలసీమలో కరువు పరిస్థితుల నడుమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1997లో ప్రారంభమైన ఈ మహత్తర ప్రాజెక్టు ఇప్పటికీ లక్షలాది మందికి ప్రాణాధారంగా నిలుస్తోందని గుర్తుచేశారు.
project | ప్రాజెక్టు విస్తృతి….
273 వ్యక్తిగత స్కీములు, 19 ఇతర పథకాలు,5 అదనపు స్కీములు, మొత్తం 1341 గ్రామాలు సుమారు 16.41 లక్షల మందికి త్రాగునీటి సరఫరా ఈ ప్రాజెక్టును ఇటీవల జిల్లా పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల నిర్వహణలో అంతరాయాలు తలెత్తే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఆధీనంలో ఈ స్థాయి ప్రాజెక్టును సమర్థంగా నిర్వహించడం కష్టసాధ్యమని, దీని వల్ల నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని ప్రజల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలిపారు.

project | “బాబా డ్రీమ్ ప్రాజెక్టు”గా ప్రత్యేక గుర్తింపు…
సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్వప్నంగా ప్రారంభమైనదని, ఇది సాధారణ ప్రభుత్వ పథకం కాదని ఆమె పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం, దాతృత్వంతో నిర్మితమైన ఈ పథకాన్ని తిరిగి స్వతంత్రంగా సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్ట్ కింద కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఈ పథకంలో పనిచేస్తున్న 596 మంది కార్మికుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తక్షణ చర్యలు తీసుకుని ప్రాజెక్టును జిల్లా పరిషత్ నుంచి తొలగించి యథావిధిగా కొనసాగించాలని ప్రత్యేకంగా కోరారు.

