వైద్య వృత్తిలో స్థిత ప్రజ్ఞత అవసరం..

వైద్య వృత్తిలో స్థిత ప్రజ్ఞత అవసరం..
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
గుంటూరు జీజీహెచ్ కాన్వకేషన్ లో పాల్గొన్న మంత్రి
నూతన వైద్యులకు పలు సూచనలు చేసిన డాక్టర్ పెమ్మసాని
గుంటూరు మెడికల్, ఆంధ్రప్రభ : వైద్య వృత్తిలో స్థిత ప్రజ్ఞత అవసరం అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వ్యక్తిగతమైన వ్యవహారాలు, సవాళ్లను వృత్తిపై పడకుండా ఉండే మానసిక స్థిరత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గుంటూరు మెడికల్ కళాశాలలో శనివారం నిర్వహించిన కాన్వకేషన్ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, కుటుంబాలు మరియు పండగలకు దూరంగా ఉండి ఈరోజు వైద్యులుగా ధ్రువీకరణ పత్రాలు అందుకుంటున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
విద్యార్థి దశలో బయోకెమికల్ ఆల్గోరిథమ్‌లు, డయాగ్రామ్‌లు వంటి ఎన్నో విషయాలు నేర్చుకుంటారని, కానీ వైద్య వృత్తిలో నిజమైన విలువ సేవలోనే ఉంటుందని చెప్పారు. తాను చిన్నప్పుడు తెనాలిలో ఉండగా డాక్టర్ దక్షిణామూర్తి పేరు తరచుగా వినేవాడినని, అప్పట్లో దాని అర్థం తెలియకపోయినా డాక్టర్ అయిన తర్వాత అది ప్రజలకు సేవ చేసే వైద్యుడికి లభించే గౌరవమని అర్థమైందన్నారు.
వైద్యుడు సంపాదన కోసం కాకుండా రోగులకు ఎలా సేవ చేశామన్నదే ముఖ్యమని, ఈ విలువలు గుంటూరుకు మాత్రమే కాదు ప్రపంచమంతటికీ వర్తిస్తుందని చెప్పారు. మంచి వైద్యుడిగా ఎదగాలంటే కొన్ని ప్రాథమిక విషయాలు గుర్తుంచుకోవాలని సూచించారు. తమతో పని చేసే సిబ్బంది, నర్సులు, కాంపౌండర్లతో గడిపే సమయానికి మించి రోగులతో ఎక్కువ సమయం గడపాలని అన్నారు.
కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని, సహచర వైద్యులు, ఇతరులతో దగ్గరగా ఉండాలని సూచించారు. ఎవరితోనైనా దూరంగా ఉంటే అపార్థాలు, ద్వేషాలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎంత పోటీ ఉన్నా విషయ పరిజ్ఞానం ఉంటే తప్పకుండా మన ప్రతిభను నిరూపించుకోవచ్చని పేర్కొన్నారు.
ఆసక్తికరమైన కేస్ స్టడీలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలని, వైద్యులు తమ ప్రాధాన్యతను తామే నిర్మించుకోవాలని సూచించారు. మార్కెట్‌లోకి వస్తున్న కొత్త మెడిసిన్స్‌పై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. ఆర్థిక విషయాల్లో అవగాహన ఉండాలని కానీ అప్పులు, ఈఎంఐల ఒత్తిడిలో పడకూడదని హెచ్చరించారు. అలాంటి ఒత్తిడి వృత్తిపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
ప్రతి వ్యక్తికి ధనం మాత్రమే కాదు, గౌరవం, సంతోషం, ఆత్మసంతృప్తి కూడా ఎంతో అవసరమని చెప్పారు. యూ-వరల్డ్ అనే సంస్థ కూడా ఆదాయం కోసం కాకుండా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే ఆలోచనతో ప్రారంభమైందని, ఆ ఆలోచన ఇవాళ వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ యశస్వి రమణ, జీఎంసీ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
