కొలనుపాకలో రేణుకాచార్య చిత్రపటం ఊరేగింపు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లో జరుగుతున్న రేణుక ఆచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చిత్రపట ఊరేగింపు, ధార్మిక సభ, కళ్యాణోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. చిత్రపట ఊరేగింపులో భారీ సంఖ్యలో కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి తరలివచ్చిన వీర శైవ భక్తులు పాల్గొన్నారు. వివిధ వేషధారణలతో విన్యాసాలను ప్రదర్శిస్తూ సాగిన చిత్రపట ఊరేగింపు ఆద్యంతం భక్తిమయంగా కొనసాగింది. సోమేశ్వర స్వామి నామస్మరణ మధ్య ఆలయంలో జరిగిన పూజలకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం రథోత్సవం, లక్షదీపార్చనతో ఉత్సవాలు ముగియనున్నాయి.
