విశాఖపట్నం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో విశాఖ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని, పెద్ద ఎత్తున పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. సరళీకృత జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


2017లో ప్రవేశపెట్టిన జీఎస్టీని రెండు అంచెలకు (5%, 18%) సరళీకరించి, నిత్యావసర వస్తువులు, రైతులకు అవసరమైన వస్తువుల ధరలను తగ్గించి, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించినట్లు తెలిపారు. ఈ సంస్కరణలు దసరా, దీపావళి, సంక్రాంతి సంబరాలను ముందే తెచ్చాయని, అన్ని వర్గాల ప్రజలకు ఆనందాన్ని అందిస్తాయని వ్యాఖ్యానించారు.

అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సెప్టెంబర్ 14న విశాఖలోని రైల్వే గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారని మాధవ్ వెల్లడించారు. ఈ సభ సారథ్యం యాత్ర ముగింపు కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మురళీ పరుశురాం రాజు అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, కోశాధికారి నాగేంద్ర, సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కేశవ్ కాంత్, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, ఆర్టీఐ కన్వీనర్ వెంగమాంబ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply