శ్రీశైలంలో ప్రధాని పూజలు
పూర్ణకుంభంతో మోదీకి స్వాగతం పలికిన వేదపండితులు, అధికారులు
ప్రధానమంత్రికి స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, శేష వస్త్రాల బహూకరణ
హెలిప్యాడ్ వద్ద ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
నంద్యాల బ్యూరో అక్టోబర్ 16 ఆంధ్రప్రభ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) గురువారం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ప్రధానికి వేద పండితులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అదే విధంగా నంది మండపం సర్కిల్ నుంచి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివసేవకులు కాషాయ వస్త్రధారణలో నిలబడి హర హర మహాదేవ అంటూ ప్రధానమంత్రి ఘన స్వాగతం పలికారు. ప్రధాని పూజల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శ్రీ స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, శేష వస్త్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బహూకరించారు. అంతకుముందు కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి ప్రధానమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హెలికాప్టర్ ద్వారా సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

హెలిప్యాడ్ వద్ద ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఆర్అండ్‌బీ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, కలెక్టర్ జి.రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షెరాన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో అడిషనల్ ఐజీ ఆకే రవి కృష్ణ, పోలీసు ఉన్నతాధికారి అధి రాజ్ సింగ్ రాణా,జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆలయ ఈఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.


