హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : కాళేశ్వరంపై విచారణ పేరుతో ప్రధాని మోదీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President), సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తార‌క‌రామారావు(Sircilla MLA K. Taraka Rama Rao) ఆరోపించారు. సీబీఐ విచారణ(CBI investigation) పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుతంత్రాలకు తెరదీశారని విమర్శించారు.

ఈ రోజు పార్టీ శ్రేణులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌(teleconference)లో మాట్లాడారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడమంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమే అని కేటీఆర్ అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను ప్రధాని మోడీ జేబు సంస్థలుగా విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 48 గంటల్లో ఎందుకు మాట మార్చారో చెప్పాల‌న్నారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వమంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ(BJP) దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంద‌ని, రాహుల్ గాంధీకి చేదుగా అనిపించిన సీబీఐ, రేవంత్‌కు మాత్రం ముద్దోస్తోందా? అని ప్ర‌శ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) అంశాన్నిసీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిష‌న్‌రెడ్డి, బండి సంజయ్(Union Ministers Kishan Reddy, Bandi Sanjay) కోరగానే, రేవంత్ ఆ దిశగా ముందుకెళ్లడం ఆ రెండు పార్టీల సంబంధానికి సాక్ష్యమ‌న్నారు.

గతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలినా, సుంకిశాలలో సైడ్ వాల్ కూలినా, వట్టెం పంప్ హౌజ్ కూలిపోయినా, పెద్దవాగు రెండు సార్లు కొట్టుకుపోయినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పుడు జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ, మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే మాత్రం ఆగమేఘాలపై వ‌చ్చింద‌న్నారు. బెదిరింపులు, కేసులు త‌మ‌కు కొత్తేం కాద‌ని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలకైనా, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధ‌మ‌ని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply