AP| లైంగిక వేధింపుల నిరోధం అందరి బాధ్యత

- ఎపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ
AP| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : లైంగిక వేధింపుల చట్టాల పై మహిళలు అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బీఆర్ అంబేద్కర్ కళావేదికలో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఆచరించే విధానం పై నిర్వహించిన వర్క్ షాప్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువగా గృహ హింసకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
లైంగిక వేధింపులపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. స్వయం రక్షణకు విద్యార్దినులను కరాటే వంటి వాటిని నేర్చుకోవాలని చెప్పారు. మహిళలు పని చేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ వేధింపులకు గురౌతున్నట్లు తెలిపారు. మహిళలు తమకు ఉండే మహిళా హక్కులు కాపాడుకోవాలన్నారు. సంఘటిత రంగాల్లోనే లైంగిక వేధింపులకు గురౌతున్నట్లు వివరించారు. మహిళలు తమకు జరుగుతున్న లైంగిక వేధింపులను ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చి చట్టాల పై అవగాహన పెంచుకోవాలన్నారు. బయటికి పనికి వెళుతున్నపుడు సంతోషంగా వెళ్లాలని, కొంతమంది వారికి జరుగుతున్న వేధింపులు బయటకు చెప్పుకోలేక, పని మాను కోలేక పనులకు బాధతో వెళ్తున్నారన్నారు.
వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, జీడి పరిశ్రమ, తదితర పరిశ్రమల్లో పనిచేయడానికి మహిళలు వెళతారని అక్కడ వేధింపులు జరిగేందుకు అవకాశం ఉందని, అలాంటి ప్రాంతాల్లో లోకల్ కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. లైంగిక వేధింపుల చట్టం 2013లో తీసుకురావడమైనదని, ఈ చట్టం అమలుకు కృషి జరుగుతోందన్నారు. ఉద్యోగులకు కూడా ఈ చట్టం పై సరియైన అవగాహన లేదన్నారు. జిల్లాల్లో లైంగిక వేధింపుల చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అసంఘటిత కార్మికులకు కూడా ఈ చట్టం పై అవగాహన ప్రతీ ఒక్కరిలో ఉండాలన్నారు.

కమిటీల్లో ఉన్న వారు ఈ చట్టం పై శిక్షణ తీసుకోవాలని చెప్పారు. ప్రతీ ఒక్కరూ భాత్యత తీసుకొని లైంగిక వేధింపులను అరికట్టడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. మహిళలు అభివృద్ధి పథంలో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత కార్మికులు ఉంటారని చెప్పారు. కార్మికులు పనిచేసే చోట పది మంది మహిళలు కంటే ఎక్కువమంది ఉంటే స్థానిక కంప్లైంట్ కమిటీలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై నారీమణి మాట్లాడుతూ.. మహిళల సమస్యలు ఛైర్ పర్సన్ కు తెలపాలన్నారు.
అన్ని శాఖల మహిళలు లైంగిక వేధింపులకు గురౌతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భీమునిపట్నం ప్రిన్సిపాల్ పెంకి సురేఖ మాట్లాడుతూ.. పనిచేసే చోట లైంగిక వేధింపులను మహిళలు ఎదుర్కొంటున్నారన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మహిళలకు న్యాయం జరగాలని కోరారు. లోకల్ కంప్లయింట్ కమిటీ నుండి లక్ష్మీ కుమారి మాట్లాడుతూ.. తప్పు చేస్తే శిక్ష వస్తుందనే విధంగా ఈ కమిటీ స్వచ్ఛందంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పనిచేసే చోట మహిళలకు వేధింపుల నిరోధానికి స్థానిక కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు కావాలని కోరారు.
బెజ్జిపురం మనోవికాస కేంద్రం అధ్యక్షులు ప్రసాదరావు మాట్లాడుతూ.. మహిళల హక్కులకు భంగం వాటిల్లకూడదన్నారు. మహిళలు మహిళా సాధికారతను సాధించాలన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశానంతరం సురక్షిత గ్రామ కార్యక్రమం అనే పుస్తకాన్ని మహిళా కమిషన్ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సలహా దారులు రావూరి సూయిజ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ విమల, బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావ్యజ్యోత్న, ఎన్.ఎస్.ఎస్. జిల్లా కో ఆర్డినేటర్ వనజ, స్వచ్ఛంద సేవా సంస్థలు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
