పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మౌలిక సదుపాయాలు
మూడు ఎకరాలు స్థలంలో కంటి ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్బంగా బుధవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కలో కోటి 91 లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి పోవడాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ నిధులతో పాటు, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో అవసరమైన మౌలిక సదుపాయాలు,డాక్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాన్యం చెల్క యు పిహెచ్ సి కి నూతన భవనాన్ని నిర్మించడమే కాకుండా,అవసరమైన మెడికల్ సామాగ్రిని ఏర్పాటు చేయడం జరిగిందని .
ఇంకా అవసరమైతే ఎక్కువ ఎక్విప్మెంట్ సమకూరుస్తామన్నారు. చుట్టుపక్కల ప్రజలు,పెద్దవారు గర్భిణీ స్త్రీలకు, మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనువుగా ఉంటుందని ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తామని,పరీక్షలతో పాటు, అవసరమైతే ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి రిఫర్ చేసే విధంగా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. కార్పొరేటర్లు వివిధ రకాల జబ్బులతో బాధపడే ప్రజలను గుర్తించి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలని చెప్పారు. నల్గొండ కార్పొరేషన్ అయినందున సిసి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మంచి వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రతీక్ ఫౌండేషన్ , ఎల్వీ ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో మూడెకరాల స్థలంలో కంటి ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.అనుకోకుండా పట్టణ పి హెచ్ సి లో మందులు అందుబాటులో లేకుంటే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక ప్రయివేట్ మెడికల్ షాపును గుర్తించి అవసరమైన అత్యవసర మందులు అందజేసే విధంగా అనుసంధానం చేయడం జరిగిందని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
అవసరమైతే మాన్యం చెల్కపట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్షయ ఫౌండేషన్ సహకారంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఆహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు, ఆశ వర్కర్లు బాగా పనిచేయాలని, పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. మాన్యం చెల్క చౌరస్తా సుందరీకరణతో పాటు, విస్తరించి తీర్చిదిద్దడం జరుగుతున్నదని తెలిపారు.నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మాన్యం చెల్క తో పాటు, చుట్టుపక్కల వార్డుల ప్రజలకు పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సొంతంగా 50 లక్షల రూపాయలను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇవ్వడం పట్ల ఆమె మంత్రిని అభినందించారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటుచేసిన మాన్యం చెల్కపట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని రకాల పరీక్షలను సైతం ఇక్కడే చేసుకోవచ్చని, డాక్టర్లు పేద ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం అందించాలని కోరారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యతోపాటు, పేద ప్రజలకు వైద్యం అందించేందుకు మంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆస్పత్రికి అవసరమైతే అదనపు సౌకర్యాలు, మెడికల్ ఎక్విప్మెంట్ కు సహకారం అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వైద్యాన్ని ఈ ఆస్పత్రి ద్వారా పొందవచ్చని, ఆసుపత్రి డాక్టర్లు,సిబ్బంది ఆవిధంగా పని చేయాలన్నారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య ఉత్సవాల్లో మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇక్కడ వివిధ రకాల టెస్టులను చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ను అందరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడారు.డిప్యూటీ మేయర్ అమీర్ అలీ ,ప్రధాన ఆస్పత్రి సూపరింటిండెంట్ నరసింహారావు నేత, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా టీబి నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, యు పి హెచ్ సి డాక్టర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
