Prabhas, Ravitaja | చిన్న సినిమాలకు స్టార్ సపోర్ట్ : కపుల్ ఫ్రెండ్లీకి ప్రభాస్, సుమతి శతకానికి రవితేజ

Prabhas, Ravitaja | చిన్న సినిమాలకు స్టార్ సపోర్ట్ : కపుల్ ఫ్రెండ్లీకి ప్రభాస్, సుమతి శతకానికి రవితేజ
- చిన్న సినిమాల ట్రెండ్ మారుతోంది
- కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్‌కు ప్రభాస్ ప్రశంసలు
- వాలెంటైన్స్ డే రిలీజ్‌పై అంచనాలు
- సుమతి శతకం టీమ్‌కు రవితేజ సపోర్ట్
- స్టార్ ప్రమోషన్‌తో పెరిగిన బజ్
Prabhas, Ravitaja | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇప్పుడు ట్రెండ్ మారింది.. కంటెంట్ ఉంటే.. అందులో ఉన్న కటౌట్ ఎవరిది అనేది చూడకుండా సినిమాలు చూస్తున్నారు. అందుకనే.. చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. అలాగే మన స్టార్ హీరోలు కూడా చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తున్నారు. చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ.. ఈ ఇద్దరు స్టార్ హీరోలు.. చిన్న సినిమాలకు అండగా నిలవడం విశేషం. ఇంతకీ.. ప్రభాస్, రవితేజ సపోర్ట్ చేస్తున్న చిన్న సినిమాలు ఏంటి..?

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ ట్రైలర్ బాగుందంటూ ప్రశంసలు అందించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆయన కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇది నేరుగా హృదయాల్లోంచి చెప్పిన ప్రేమ కథ అంటూ అప్రిషియేట్ చేశారు. తమ మూవీ ట్రైలర్ కు ప్రభాస్ నుంచి వచ్చిన ప్రశంసలతో కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి ప్రభాస్ సపోర్ట్ చేస్తుండడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం సుమతి శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుండి మంచి అభినందనలు లభించాయి.

సీరియల్స్ అలాగే బిగ్ బాస్ ద్వారా ప్రతి ఇంట్లో ఒకరిగా అందరికీ పరిచయమైన అమర్దీప్ చౌదరి మాస్ మహారాజ్ రవితేజ అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్ చూసిన మాస్ మహారాజ్ రవితేజ స్పందిస్తూ.. అమర్దీప్, నీ సినిమా సుమతీ శతకం మూవీ టీజర్, ట్రైలర్ ఇంకా ఇతర కంటెంట్ చూడడం జరిగింది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇలా కపుల్ ఫ్రెండ్లీ కోసం ప్రభాస్, సుమతి శతకం కోసం రవితేజ ప్రమోట్ చేయడం విశేషం. మరి.. ఈ రెండు చిన్న సినిమాలు ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
CLICK HERE TO READ చిరంజీవి–బాబీ మూవీలో కృతి శెట్టి ఔట్..? సారా అర్జున్ ఎంట్రీ ఖరారేనా..?
